అలాంటి పాత్రలొస్తే చేయడానికి సిద్ధమే
సుమన్ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం బిచ్చగాడా మజాకా. కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 1వ తేదీన విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమన్ మీడియాతో మాట్లాడారు. దర్శకుడికి ఇదే తొలి చిత్రం. కానీ చిత్రరంగంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. నా పాత్ర ఆకట్టుకుంటుంది. కథానాయికకు తండ్రిగా నటిస్తున్నాను. చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించే పాత్ర నాది. కష్టపడి సంపాదించడం ఎందుకు? అడ్డదారులు ఉండగా అని యువత భావిస్తోంది. అలాంటి వాళ్లకు ఈ చిత్రం ఓ పాఠంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా నిరుద్యోగులు చూడాల్సిన సినిమా ఇది అన్నారు. పరిశ్రమలో వస్తున్న ప్రతినాయక పాత్రల గురించి చెబుతూ బలమైన ప్రతినాయకుడు ఉన్నప్పుడే హీరోయిజం పండుతుంది. ఈ విషయం రాజమౌళి బాగా పసిగట్టారు. బాహుబలి లో రానా పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగా నచ్చింది. చివరి వరకు ఓటమి ఒప్పుకోని పాత్రగా రానా పాత్రని మలిచారు. అలాంటి పాత్రలొస్తే చేయడానికి సిద్ధమే అన్నారు.













