2020 అద్భుతమైన పాఠాలు నేర్పింది..
2020 సంవత్సరం మనందరికీ అద్భుతమైన పాఠాలు నేర్పిందని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తిరుమల శ్రీవారిని రాజేందప్రసాద్ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా పరీక్షలు పెట్టి ఎన్నో పాఠాలు నేర్చుకునేలా చేసిందన్నారు. జీవితం అంటే ఏమిటో.. ఎలా బ్రతకాలో ప్రజలందరికీ స్వామి వారు కరోనాతో తెలియజేశారని తెలిపారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వారా తెరిచి ఉంచడం అందరి అదృష్టంగా అభివర్ణించారు. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారా గుండా స్వామి వారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించడం సంతోషంగా ఉందన్నారు. తర్వాత అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2021 సంవత్సరంలో కొత్త సినిమాలతో అందరి ముందుకు రాబోతున్నానని చెప్పుకొచ్చారు.













