మేం పెళ్లికి రెడీ అంటున్న నితిన్, షాలిని
దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల పరిశ్రమలకు, వ్యాపారాలకు, విద్యా సంస్థలకే కాదు పెళ్ళిళ్ళకు కూడా ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే. బంధు మిత్రులందర్నీ పిలిచి ఆర్భాటంగా చేసుకోవాల్సిన పెళ్లి ఇప్పుడు కొంతమంది సమక్షంలోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కాకుండా ఆర్భాటంగానే పెళ్లి చేసుకోవాలనుకున్న కొందరు పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. వారిలో రానా, నితిన్, నిఖిల్ ఉన్నారు. అయితే ఇప్పట్లో పరిస్థితులు చక్కబడేలా లేవని గ్రహించిన నిఖిల్ నిరాడంబరంగానే పెళ్లి చేసేసుకున్నాడు.
ఆమధ్య నిర్మాత దిల్‌రాజు కూడా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ పెళ్ళి చేసుకున్నాడు. రానా పెళ్లి కూడా ఆగస్ట్‌లో జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా హీరో నితిన్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. నితిన్, షాలినిల ఎంగేజ్మెంట్ ఫిబ్రవరిలోనే జరిగింది. దుబాయ్‌లో ఎంతో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారు ఈ జంట. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసే సమయానికి లాక్డౌన్ వచ్చి పడింది. దీంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు నితిన్ షాలిని. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ఇప్పట్లో సాధారణ పరిస్థితి వచ్చేలా లేదు. అందుకే మేం పెళ్లికి రెడీ అంటున్నారు నితిన్, షాలిని. హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో వీరి వివాహం జరగనుంది. బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యే ఈ వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నారు. అయితే జూలైలోనే వీరి వివాహం జరగబోతోంది.













