దర్శకుడు విస్సు ఇకలేరు
ప్రముఖ తమిళ సీనియర్ దర్శకుడు, నటుడు, రచయిత విసు (75) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆదివారం చైన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు ఎంఆర్ విశ్వనాథన్. కె.బాలచందర్ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ను ఆరంభించారు. తిల్లుమల్లు తో నటుడిగా మారారు. కణ్మణి పూంగా తో దర్శకుడు అయ్యారు. మనల్ కయిరు, చిదంబర రహస్యం లాంటి చిత్రాలను తెరకెక్కించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు కొన్ని తెలుగులో రీమేక్ అయ్యాయి. వాటిలో ఆడదే ఆధారం, శ్రీమతి ఒక బహుమతి లాంటి చిత్రాలున్నాయి. ఆయన పలు తెలుగు చిత్రాల్లోనూ నటించారు. విసు తీసిన నీంగ నల్ల ఇరుక్కనుమ్ జాతీయ పురస్కారం అందుకుంది. విసు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.













