Kannappa: కన్నప్ప యూఎస్ టూర్ సక్సెస్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప (Kannappa) సినిమాను భారీ మైథలాజికల్ పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. విష్ణు కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టు. అందుకే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ఈ సినిమాను గ్లోబల్ వైడ్ గా ప్రమోట్ చేయడానికి అమెరికా వెళ్ళారు. న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కోలను కవర్ చేస్తూ సందడి చేశారు. సినిమా ప్రమోషన్‌ను చేపట్టారు. ప్రతీ సిటీలోనూ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ను ప్రత్యేకంగా పలకరిస్తూ, స్పెషల్ ట్రీట్స్ ఇచ్చారు. ప్రత్యేక ప్రదర్శనలను తిలకించేలా ప్లాన్ చేసుకున్నారు. కన్నప్ప ఏడు నిమిషాల ప్రచార వీడియో చూసి ఓవర్సీస్ జనాలు ఆనందం వ్యక్తం చేసినట్లు వార్త. ప్రమోషన్స్ మెటీరియల్, ఉత్కంఠభరితమైన విజువల్స్, మేకింగ్స్ విజువల్స్ తో కూడిన గ్లింప్స్ ను ప్రదర్శించారు మేకర్స్. ప్రతీ వేదిక కూడా చప్పట్లతో హోరెత్తింది.
భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మక భక్తి చిత్రాల్లో ఒకటైన కన్నప్ప స్థాయి, కథ వివరణ, గొప్పతనాన్ని చూసి ప్రేక్షకులు అంతా మంత్ర ముగ్ధులయ్యారు! విష్ణు కూడా తన ప్రమోషనల్ టాలెంట్ తో ఆకట్టుకున్నారట. ప్రతి వేదికలోనూ ఆయన స్వయంగా అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. క్వశ్చన్, ఆన్సర్ సెషన్లలో అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఓవర్సీస్ లో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలతో హృదయపూర్వక సంభాషణలకు సమయం కేటాయించారు. దీంతో ఆయనపై అంతా ప్రశంసలు కురిపించారు. మూవీ హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా విష్ణు అమెరికాలోని ప్రముఖ తెలుగు మీడియా సంస్థలతో నిమగ్నమై కన్పప్పను వేరే లెవెల్ లో ప్రమోట్ చేశారు. కన్నప్ప కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఇది ఒక అనుభవమని చెబుతున్నారు. మరి జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న మూవీతో ఆయన ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాలి.
న్యూజెర్సీలో రీగల్ సినిమా కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమోషన్‌కు మంచి స్పందన కనిపించింది. మొదటగా కన్నప్ప సినిమాకి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వసారా ఎంటర్టైన్మెంట్ సిఇఓ ఐశ్వర్య, హీరో మంచు విష్ణుని రీగల్ సినిమా కాంప్లెక్స్ లోకి స్వాగత పూర్వకంగా తీసుకు వచ్చారు. రుద్ర డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 20 మంది అమ్మాయిలు అబ్బాయిలు కన్నప్ప సినిమాలోని శివ శివ శంకరా పాటకి అద్భుతమైన డాన్స్‌తో స్వాగతం పలికారు. థియేటర్ లో కన్నప్ప సినిమాకు సంబంధించిన కొన్ని ప్రోమో లను బిగ్ స్క్రీన్ మీద చూసిన అతిథులందరూ సినిమా టేకింగ్ మీద, గ్రాండియర్ మీద, అద్భుతమైన లొకేల్స్ మీద ప్రశంసలు ఇచ్చారు.
కన్నప్ప సినిమా తీయడం ఒక కల. ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందని మంచు విష్ణు తన ప్రసంగంలో పేర్కొన్నారు. కన్నప్ప కథలో అనేక పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలకు మోహన్ బాబు, మోహన్ లాల్, హీరో ప్రభాస్, హీరో అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించారు. నేను మోహన్‌బాబు కొడుకు అవటం వలన వారందరూ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నారు. హీరో ప్రభాస్‌తో మంచి స్నేహం వుంది. ఈ సినిమాకి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారని చెప్పారు.