Dhandoraa: ‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది – దర్శకుడు మురళీకాంత్
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను మురళీకాంత్ తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు మురళీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన చిత్ర విశేషాలివే..
‘దండోరా’ కథ ఆలోచన ఎక్కడ, ఎలా మొదలైంది?
మాది మెదక్. నాకు ఓ మంచి సినిమాను తీయాలనే కోరిక ఉండేది. అమెరికాలో జాబ్ చేస్తుండేవాడిని. కానీ నాకు అది రొటీన్ లైఫ్ అని అనిపించింది. నేను అక్కడ కూడా ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడిని. అలా సినిమాల మీద ఇష్టంతో జీవితంలో రిస్క్ తీసుకుని ఇటు వైపు వచ్చాను. నా మెదడులో చాలా కథలు ఉన్నాయి. అయితే ప్రేమ కథల్ని నెరేట్ చేయడం చాలా కష్టం. అందుకే ఓ కాన్సెప్ట్, మూలాల్లోని కథ చెప్పాలని ఈ స్టోరీ అనుకున్నాను. పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో మంది, ఎన్నో రకాల లైఫ్ స్టైల్స్ తెలుస్తాయి. సమాజంలోని అసమానతల మీద కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘దండోరా’ తీశాను.
‘దండోరా’ కథ కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు?
చనిపోయిన వ్యక్తుల్ని పూడ్చేందుకు కమ్యూనిటీ వైజ్‌గా, రిలీజియస్ వైజ్‌గా కొంత మందికి భూమిని కేటాయిస్తారని నాకు అంతగా తెలీదు. నాకు ఎదురైన ఓ అనుభవంతో ఈ కథను రాసుకున్నాను. మలయాళంలో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తాయని అంటుంటారు. మన దగ్గర ఎందుకు రావు? అనే ఆలోచనల్లోంచి ఈ కథను రాసుకున్నాను.
‘బలగం’ కూడా చనిపోయిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ‘దండోరా’తో పోలికలు ఏమైనా వస్తాయా?
‘బలగం’లో వ్యక్తి చనిపోయిన తరువాత జరిగే పిండ ప్రధానం చుట్టూ తిరుగుతుంది. ‘దండోరా’ చిత్రంలో వ్యక్తి చనిపోయిన తరువాత నుంచి పూడ్చి పెట్టే వరకు జరుగుతుంది. క్రిమేషన్తో ఈ చిత్రం ఎండ్ కార్డ్ పడుతుంది. ‘బలగం’ కథకి, ‘దండోరా’కి ఎలాంటి పోలికలు, స్పూర్తి గానీ లేదు. ఓ వ్యక్తిని ఎందుకు పూడ్చనివ్వడం లేదు? ఆ ఊరి సమస్య ఏంటి? సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా? అన్నదే కథ.
‘దండోరా’లో ప్రధాన పాత్ర ఎవరిది?
‘దండోరా’లో ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని పాత్రలు శివాజీ గారి కారెక్టర్‌కు లింక్ అయి ఉంటుంది. కానీ ఇందులోని ప్రతీ కారెక్టర్‌కి స్కోప్ ఉంటుంది. బిందు మాధవి గారి పాత్ర అయితే చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. వెరీ స్ట్రాంగ్ ఉమెన్‌గా ఆమె పాత్ర ఉంటుంది. నా ఈ చిత్రంలో నిర్ణయాలన్నీ మహిళ పాత్రలే తీసుకుంటాయి.
వైకుంఠధామాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా?.. ఈ చిత్రంలో ఆ పాయింట్ టచ్ చేశారా?
ప్రభుత్వాలు వైకుంఠ ధామాల్ని ఏర్పాటు చేసింది. కానీ అక్కడ కూడా వివక్షనే చూపిస్తుంటారు. నేను ప్రత్యక్షంగా ఎన్నో ఘటనల్ని చూశాను. అందుకే ఈ కథను రాసుకున్నాను. అయితే ఈ సమస్యకు నేను పూర్తిగా పరిష్కారాన్ని ఇచ్చానా? చూపించానా? అన్నది సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్పాలి.
‘దండోరా’ విషయంలో నిర్మాతల సహకారం గురించి చెప్పండి?
‘దండోరా’ కథ రాసుకున్న తరువాత నాకు సంతృప్తిగా అనిపించింది. అయితే ఈ కథను చాలా మంది నిర్మాతలకు పంపాను. కానీ నిర్మాతల అభిరుచికి తగ్గట్టుగా మన కథను పంపాలని తర్వాత తెలుసుకున్నాను. అలా రవీంద్ర గారికి కథ పంపాను. నేను చెప్పిన కథ ఆయనకు వెంటనే నచ్చింది. తక్కువ బడ్జెట్లో చేద్దామని నేను చెప్పాను. కానీ మంచి క్వాలిటీతో, భారీ ఎత్తున తీయాల్సిందే అని రవీంద్ర గారే ముందుండి నడిపించారు. ఈ ప్రయాణంలో మా ఇద్దరి మధ్య ఎన్నో క్రియేటివ్ డిస్కషన్స్ వచ్చాయి. సినిమా చూసిన తరువాత రవీంద్ర గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు.
‘దండోరా’ వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
నేను ఇంత వరకు ఎవ్వరి దగ్గరా ఏడీగా పని చేయలేదు. ఒకేసారి సెట్లో వంద, రెండొందల మందిని చూసే సరికి భయపడ్డాను. మొదటి రెండు రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఆ తరువాత సెట్ అయ్యాను. నేను రెండు, మూడు రోజుల్లో తీసిన అవుట్ పుట్ చూసి అందరూ మెచ్చుకున్నారు. అలా ఫస్ట్ షెడ్యూల్లోనే 18 రోజులు షూట్ చేశాం.
‘దండోరా’ టైటిల్ గురించి చెప్పండి?
ముందుగా ఈ మూవీ కోసం వేరే టైటిల్ అనుకున్నాను. ఇది నాకు మూడేళ్ల జర్నీ. ‘అంతిమ యాత్ర’ అనే వర్కింగ్ టైటిల్‌ను అందరూ చూసి డల్‌గా ఉందని అనుకున్నారు. మనం మంచి కథను, మంచి సౌండింగ్‌తో చెబుతున్నాం కదా.. టైటిల్ కూడా అంతే పవర్ ఫుల్‌గా ఉండాలని నిర్మాత అన్నారు. అలాంటి టైంలో ఓ ఫ్రెండ్ ‘దండోరా’ అని సలహా ఇచ్చారు. అలా ఈ మూవీకి కరెక్ట్ టైటిల్ దొరికినట్టు అయింది.
‘దండోరా’ నుంచి ఆడియెన్స్ ఏం ఆశించి థియేటర్‌కు రావాలి? ‘దండోరా’లో ఏం ఉండబోతోంది?
‘దండోరా’ టైటిల్ వినగానే అందరి మైండ్‌లో ఎన్నో ఊహాగానాలు వచ్చి ఉంటాయి. కథ అలా ఉంటుందా? ఇలా ఉంటుందా? ఈ పాయింట్ చెబుతున్నాడా? అని ఇలా పది అంశాల్ని ఊహిస్తారు. కానీ సినిమా చూసిన తరువాత ప్రతీ ఒక్కరూ సర్ ప్రైజ్ అవుతారు. మార్క్ కె రాబిన్ గారి మ్యూజిక్, ఆర్ఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో ఆర్ఆర్ అందరినీ కదిలిస్తుంది. ‘దండోరా’ చిత్రం, అందులోని స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఓ అందమైన అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు.






