Boyapati Srinu: ‘అఖండ 2 తాండవం’ విజయం చాలా ఆనందాన్ని, గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది: బోయపాటి శ్రీను
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ అఖండ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
-ఈ అఖండ విజయాన్ని ఎంత ఫీలైనా తక్కువే. ఇంకా కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా డబ్బు కోసం తీసింది కాదు. ఈ సినిమా ప్రజలకు చేరాలని తీశాం. మన తత్వం ఏమిటి? ప్రపంచంలో ఎవరైనా మనల్ని చూసి చేతులెత్తి దండం పెడతారు ఎందుకు? మనం ఆచరించే ధర్మం కోసం. మనం బిడ్డ పుట్టగానే పేగు తెంచి దేవుడికి ముడి వేస్తాం. దేవుడు పేరు పెట్టుకుంటాం. ఎదుగుతుంటే దేవుడు దయ అంటారు. చివరికి లోకాన్ని విడిచినప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంటాం. మనకి కష్టం వచ్చినా దేవుడే ఆనందం వచ్చిన దేవుడే. అలాంటి అంశాలతో ఒక గొప్ప దారిని ఎంచుకుని తీసిన సినిమా ఇది. ఇది ప్రతి ఒక్కరికి చేరాల్సిన సినిమా. ఇది తప్పకుండా అందరికీ రీచ్ అవుతుంది.
ఈ సినిమా చాలా పవర్ ఫుల్ గా కమర్షియల్ అంశాలతో తీయడం జరిగింది. ఆడియన్స్ కూర్చుంటే ఊపిరి బిగబెట్టుకొని చూస్తున్నారు. అలాంటి అనుభూతితో తీసిన సినిమా ఇది.
ఈ సినిమా రిలీజ్ ఒక వారం రోజులు ఆలస్యమైంది కదా.. ఆ సమయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? బాలయ్య గారు లాంటి సపోర్ట్ ఇచ్చారు?
-నేను మనిషినే. నాకు ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని అనివార్య కారణాలవల్ల అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. అయితే మా ఆలోచన అంతా బాలకృష్ణ గారి అభిమానుల గురించే. రెండు రోజులు ముందు చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ ఒక రెండు గంటలకు ముందు టికెట్లు తీసుకుని థియేటర్స్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఇలా వాయిదా అని చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది సహజం. ఆ క్షణం మా ఆలోచనలన్నీ అభిమానుల గురించే.
– అయితే వచ్చిన పరిస్థితి గురించి మేము భయపడలేదు. మాకు బాలకృష్ణ గారు ఉన్నారనే ధైర్యం ఉంది. ఆయన మాకు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేము. అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత బాలయ్య గారు వచ్చి సినిమా విడుదలకి ఏం కావాలో అన్నీ చేశారు. ఆ తర్వాత అన్నీ కూడా సజావుగా జరిగిపోయాయి. సినిమా రిలీజ్ విడుదలై అఖండ విజయాన్ని సాధించింది.
మీరు థియేటర్స్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్ మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
-ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఒక మంచి సినిమా తీసి ఆశించాల్సిందే డబ్బు కాదు గౌరవం. అలాంటి గౌరవం వచ్చింది. సహజంగా థియేటర్స్ విజిట్ కి వెళ్ళినప్పుడు అందరూ నిలబడి విజల్స్, క్లాప్స్ కొడతారు. కానీ ఈ సినిమాకి వెళ్ళినప్పుడు అందరూ లేచి చేతులెత్తి దండం పెట్టారు. నేను కూడా ‘మీ అందరి స్పందన చూడడానికే వచ్చానని’ అందరికీ నమస్కరించి వచ్చాను. నిజంగా ఇది చాలా గొప్ప అనుభూతి.
ఈ సినిమాతో మీరు ఒక కొత్త ఏరియాలోకి ఎంటర్ అయినట్టుగా అనిపించింది?
– కొత్త పాత అని కాదు గాని..ఇదంతా మనలో మమేకమై ఉన్నది. మన ధర్మం మన తల్లి లాంటిది. మన తల్లి గురించి అద్భుతంగా చెప్పాము. మన ధర్మాన్ని మనం ఫాలో అయితే అద్భుతంగా ఉంటామని చెప్పాము. థియేటర్స్ లో చిన్న పిల్లలు ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళకేరింతలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.
దేశభక్తి దైవభక్తి ఈ రెండు కలగలిపిన సినిమాలు లేవు.. ఈ ఆలోచన ఎలా తట్టింది?
-అఖండ చూసి జనాల అంచనాలు భారీగా పెరిగాయి. తర్వాత వచ్చే సినిమా ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి అనుకున్నాము. అలాగే మన ధర్మాన్ని చెప్పడం కూడా ఒక గొప్ప విషయం. ప్రకృతి పసిబిడ్డ పరమాత్మ తర్వాత దేశం ధర్మం దైవమే నాకు కనిపించింది. అలాంటి కథతో వస్తేనే అభిమానుల అంచనాలను అందుకోగలం. అందుకే ఆ అంశాన్ని టచ్ చేయడం జరిగింది.
– ఇది అవెంజర్స్ కి స్కోప్ ఉన్నంత సినిమా. నిజానికి అవెంజర్స్, సూపర్ మాన్, బ్యాట్ మాన్.. ఇవన్నీ కూడా పుట్టించినవి. కానీ మనకున్న పాత్రలన్నీ కూడా సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినట్లు రేడియేషన్ కనిపిస్తుంటుంది. మనకు అంత ఘనమైన చరిత్ర ఉంది. ఇలాంటి సినిమాలు మనం ఎన్నైనా చేయొచ్చు. మనకు ఉండాల్సిందల్లా సంకల్పం, ఓపిక.
ఇలాంటి సూపర్ హీరో కథలు కూడా కొంతమంది లాజిక్స్ వెతుక్కుంటారు కదా ?
– మురళీమోహన్ గారి క్యారెక్టర్ తోనే మేము బిగినింగ్ లో మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. దేశానికి పెద్ద విపత్తు రాబోతుంది. దాన్ని నివారించాలంటే అష్టసిద్ధి సాధన ఒకటే మార్గమని ఆ క్యారెక్టర్‌తో క్లియర్ చెప్పించడం జరిగింది. అష్టసిద్ధి అంటే మామూలు విషయం కాదు. ఆ సాధన చేసిన వాళ్ళు ఎలాంటి శక్తులు పొందుతారు మీరు కూడా పరిశోధన చేయవచ్చు. ఆ సాధన సాధించిన వాళ్ళు చిన్న ఆకారాన్ని పొందగలరు అదే సమయంలో విశ్వరూపాన్ని చూపించగలరు. ఆ సాధనలో ఉన్న మహత్తు అది. సూపర్ హ్యూమన్ కి లాజికల్ గా వివరణ ఇచ్చాం. నిజానికి అన్ని కమర్షియల్ సినిమాల్లో ఉన్న యాక్షన్ సీన్లు ఇందులో ఉంటాయి. కానీ ఎక్కడో కాస్త అతీతం లేకపోతే ఈ క్యారెక్టర్ అలా సూపర్ పవర్ గా అవ్వదు. ఇందులో మనిషితో దిష్టి తీసి ఒక సన్నివేశం ఉంటుంది. మామూలుగా మనుషులు గుమ్మడికాయలతో తీస్తారు. అలాంటి శక్తి సాధన చేసి వచ్చిన వాళ్ళు తొలిసారి ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఎంత పవర్ ఉంటుందో ఆ సన్నివేశంతో చూపించడం జరిగింది.
ఇందులో అఘోర పాత్ర మాట్లాడినప్పుడు వాయిస్ కల్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా.. దాని కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
సినిమా అంటే ఒక యజ్ఞం. ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటూ చేయాలి. ప్రతి డీటెయిల్ నా స్క్రిప్ట్ లో ఉంటుంది. పార్ట్ వన్ లో అఘోర క్యారెక్టర్ మనందరికీ సుపరిచితం.12 సంవత్సరాలు తర్వాత ఒక సాధనలో ఉన్న వ్యక్తి బయటకు వస్తే ఎలా మాట్లాడుతాడు? అలాంటి వేరియేషన్స్ వేసుకుని డబ్బింగ్ రూంలో బాలయ్య గారితో ప్రతిదీ వివరంగా చర్చించుకుని ప్రతి క్యారెక్టర్ ఎలా మాట్లాడాలి? దాన్ని తత్వం ఏమిటి అనేది జాగ్రత్తగా ప్రతిదీ చాలా కేర్ తో చేయడం జరిగింది.
నార్త్ లో రెస్పాన్స్ ఎలా ఉంది?
-కర్ణాటక, చెన్నై, హిందీలో సినిమా ఉర్రూతలూగుతుంది. మారుమూల గ్రామాల్లో కూడా సినిమా ఆడుతోంది. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. రెవిన్యూ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం.
-ఈ సినిమా భారత దేశ ఆత్మ లాంటిది. అందరికీ చేరాలని ఉద్దేశంతో తీసిన సినిమా. 135 రోజుల్లో సినిమా తీశాను. కొబ్బరికాయ కొట్టిన రోజే డేట్ అనౌన్స్ చేస్తామని బాలకృష్ణ గారికి ముందే చెప్పాను. సెప్టెంబర్ 25 సినిమా రిలీజ్ అన్నాం. మేము అనుకున్నట్టే కాపీ రెడీ అయిపోయింది. అదే సమయానికి ఓజి సినిమా ఉంది. ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం అంత కరెక్ట్ కాదు. రెండు సినిమాలు బాగుండొచ్చు. కానీ థియేటర్స్ షేర్ అయిపోతాయి. మన రెవిన్యూని మనమే ఇబ్బంది పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అప్పుడు బాలయ్య గారు తమ్ముడికి దారి ఇచ్చేద్దాం, మనం తర్వాత వద్దామన్నారు. అలా మేము పక్కకు వచ్చాము.
– అఖండ2 త్రీడీలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ సినిమాని త్రీడీలో పిల్లలకు చూపిస్తే మరోసారి వెళ్దామని అంటారు. అంత గ్రాండ్ ఇయర్ గా వచ్చింది.
ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఒక మంచి పౌరాణికం సినిమా చేస్తే బాగుంటుందని అభిప్రాయం కలిగింది?
– నాకు అలాంటి ఆలోచన ఉంది. ఈ సినిమా వరకు మాత్రం ఆ భగవంతుడే పక్కనుండి నడిపించాడు. మేము చేసిన క్లైమాట్స్ లో ఎవరూ చేయలేరు. ఇంపాజిబుల్. కొన్ని లొకేషన్ ఫోటోలు చూపిస్తే నిజంగా భయపడతారు. అయినా మేము ఎక్కడ భయపడలేదు. నాకు ప్రతి జోనర్ చేయాలని ఉంది. అన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న తర్వాతే చేయాలి.
నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టు గురించి?
-మరో 10 రోజుల్లోనే నా నెక్స్ట్ సినిమాకు సంబంధించిన వివరాలు చెప్తాను.






