ముహూర్తం కుదిరింది
తెలుగు రాష్ట్రాలు మళ్లీ పెళ్లి కళతో కిటకిటలాడనున్నాయి. మూడు నెలలుగా శుభ ముహూర్తాలు లేకపోవడంతో రెండు రాష్ట్రాలలో వివాహాది శుభ కార్యాలకు బ్రేక్ పడింది. మరో పది రోజులలో మూఢాలు ముగిసి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో వేలాది జంటలు ఒక్కటయ్యే ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాయి. మాఘ మాసంలోని ఈ నెల 25 నుంచి వరుసగా మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు ఉండటంతో వివాహ వేదికలకు డిమాండ్ బాగా పెరిగింది. ముహూర్తాలు వివాహ వేదికలు లభించని వారు దేవాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రైవేటు విద్యా సంస్థలపై ఆధారపడుతున్నారు. వివాహ వేదికలను మూడు నెలలకు ముందే అడ్వాన్సులు చెల్లించి బుక్ చేసుకున్న వధూవరుల తల్లిదండ్రులు ఇక వివాహాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. దీంతో వివాహ ముహూర్తాలు ప్రారంభం కావడానికి వారం రోజులకు ముందే వస్త్రాలయాలు, షాపింగ్ మాల్స్‌లో కొనుగోలు సందడి నెలకొంది.













