హస్తం పిలుస్తోంది….
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. కాంగ్రెస్ లో చేరనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జరుగుతున్న పరిణామాలు సైతం అందుకు అనుగుణంగానే సాగుతున్నాయి. వైఎస్ కుటుంబానికి ఆది నుంచి సన్నిహితంగా ఉన్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ను ఇప్పటికే షర్మిల మూడుసార్లు కలవడం…రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ చెప్పడంతో.. ఇంకేముంది షర్మిల కాంగ్రెస్ లో చేరిపోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.అసలు …షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు శివకుమార్ ఒప్పించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది.
అయితే పార్టీలో షర్మిల చేరికను తెలంగాణ కాంగ్రెస్ లోని ఓ వర్గం స్వాగతిస్తోంది. పార్టీకోసం చివరివరకూ కష్టపడిన వైఎస్ కుటుంబంలోని వ్యక్తులు… పార్టీలోకి వస్తామంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చని ఆపార్టీ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సైతం చూచాయగా తెలిపారు. వారే పార్టీని వదిలిపెట్టి వెళ్లారని.. పార్టీ వారిని వదులుకోలేదన్నారు. షర్మిల వస్తే లాభమే తప్ప, పార్టీకి నష్టం లేదని మరికొందరు నేతలు చెబుతున్నారు. ఒకప్పుడు అందరూ వైఎస్ తో కలిసి తిరిగినవారు కావడంతో.. ఆ కుటుంబం నుంచి ఎవరొచ్చినా స్వాగతిస్తామంటున్నారు.
అయితే మరికొందరు మాత్రం షర్మిల రాకను స్వాగతిస్తూనే.. ఏపీకి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికీ షర్మిలను అందరూ సీమ బిడ్డగానే బావిస్తున్నారని.. అందువల్ల షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కీలకపాత్ర పోషిస్తే బాగుంటుందంటున్నారు.ఇప్పుడు తెలంగాణలో పార్టీ పరిస్థితి బలంగా ఉందని.. ఏపీలోనే పార్టీ గట్టిలీడర్ లేక ఇబ్బంది పడుతోందని… అక్కడైతే షర్మిల ఉపయోగం పార్టీకి ఉంటుందంటున్నారు. అక్కడికి వెళితే రాజశేఖర్ రెడ్డి చరిష్మా, బిడ్డ రాకతో పార్టీకి కొంతవరకైనా లాభముంటుందని చెబుతున్నారు.
మరోవైపు షర్మిలకు కూడా పార్టీని విలీనం చేయక తప్పనిపరిస్థితి ఏర్పడింది. పార్టీ పెట్టి పాదయాత్ర చేసినా, పెద్దగా ఫలితం కనిపించలేదు. బీఆర్ఎస్ సర్కార్ ఆమెను అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రజల నుంచి పెద్దగా సానుభూతి కనిపించలేదు. దీంతో పార్టీ గ్రాఫ్ పెరిగే పరిస్థితి కనిపించకపోవడంతో షర్మిల పొత్తుతో ముందుకెళదామని భావించారు. కానీ.. షర్మిల పార్టీతో పొత్తుకు ఏపార్టీ ముందుకు రాలేదు. కాంగ్రెస్ ను కలిసి పొత్తు ప్రస్తావన తెస్తే.. హస్తం నేతలు పొత్తు కాదు, పార్టీని విలీనం చేయమని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. పార్టీ సంగతి పక్కన పెడితే, తనకైనా పోటీకి సీటు, లేకుంటే పదవి దక్కుతుందని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది.













