తెరాస తో కలిసి వెళ్తారా పవన్…?
తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు స్పష్టత రావడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ను ఎదుర్కొని కొన్ని పార్టీలు ముందుకు వెళ్ళడం అనేది కష్టంగానే ఉంటుంది. ఇక వైయస్ షర్మిల కూడా తెలంగాణలో పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికి ఆమె వరుసగా అన్ని జిల్లాల అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా తన పార్టీలోకి వచ్చే నేతల విషయంలో కూడా చాలావరకు జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు షర్మిల పార్టీలోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎటువంటి అడుగులు వేస్తారు ఏంటనే దానిపై జనసేన పార్టీ నేతలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన పవన్ కళ్యాణ్ లో కనబడటంలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని భావించిన అది కూడా నిజం కాదని తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందని కొంతమంది మీడియాలో కొన్ని కథనాలు కూడా రాశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో భారతీయ జనతా పార్టీ విస్మయం వ్యక్తం చేసింది.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొన్ని సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కొన్ని సామాజిక వర్గాలు ఇతర పార్టీల వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే ఆయనకు మద్దతుగా ఉన్న కాపు సామాజికవర్గం దళిత సామాజిక వర్గాలు కూడా టిఆర్ఎస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు షర్మిల పార్టీ వైపు వెళ్లాలి అని భావించే కొంతమంది వెళ్లాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గనుక టిఆర్ఎస్ పార్టీ తో కలిస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ విషయంలో ఎలాంటి అడుగుపడుతుంది ఏంటి అనేది చూడాలి. అయితే బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పవన్ వాళ్లతో కలిసి వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు.













