ఈటల రాజేందర్ కు, కేసీఆర్ కు మధ్య గ్యాప్ ఎక్కడొచ్చింది..?
తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా, టీఆర్ఎస్ లో కీలక నేతగా గుర్తింపు పొందారు ఈటల. పార్టీ అధినేత కేసీఆర్ కు ఎంతో సన్నిహితుడు కూడా. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నాయకుల్లో ఈటల రాజేందర్ ఒకరు. సౌమ్యుడిగా, విప్లవకారుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఏదైనా విషయాన్ని చెప్పడంలో ఈటల ముక్కుసూటిగానే వ్యవహరిస్తారు. కేసీఆర్ ఎంపీగా ఢిల్లీలో బిజీగా ఉన్న సమయంలో ఈటల ఇక్కడ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేవారు. నాడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఈటల వ్యవహరించారు. అప్పట్లో టీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు ‘మొహం ఎక్కడ పెట్టుకుంటావ్ రాజేందర్’ అంటూ వై.ఎస్.చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత కూడా ఈటల పార్టీలో ఎంతో కీలక పాత్ర పోషించారు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఈటల అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ దక్కించుకున్నారంటే ఆయనకున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. కానీ రెండోసారి వచ్చేసరికి ఆయనకు ఆరోగ్యశాఖ దక్కింది. అంటే ఆయన ప్రాధాన్యత తగ్గింది. మరి ఈ గ్యాప్ ఎందుకొచ్చింది.
2014లో రాష్ట్రం ఆవిర్భవించి తొలిసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ లో కేసీఆర్ నెంబర్ వన్. రెండో స్థానంలో ఈటల, హరీశ్ రావు ఉండేవాళ్లు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చేసరికి పార్టీ ప్రాధామ్యాలు మారిపోయాయి. ఈటల వెనక్కు వెళ్లిపోయారు. హరీశ్ రావుకు కీలకమైన ఆర్థిక శాఖ దక్కినా పార్టీలో ప్రాధాన్యత ముందు స్థాయిలో లేదు. కేసీఆర్ తర్వాత కేటీఆరే అన్నీ. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న చాలా మంది నేతలు వెనక్కు వెళ్లిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అందలమెక్కారు. ఇది సహజంగానే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఈటల లాంటి కొంతమంది నేతలకు రుచించలేదు. అప్పటి నుంచి అడపాదడపా పార్టీపై ధిక్కారస్వరం వినిపించడం మొదలుపెట్టారు ఈటల రాజేందర్. ఇటీవలికాలంలో పలు సందర్భాల్లో ఈటల వేదాంత ధోరణిలో మాట్లాడారు. పదవులు, పార్టీలు శాశ్వతం కాదని, మనుషులు మాత్రమే శాశ్వతమని చెప్పారు. ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ ఊహించలేదన్న ఈటల.. తాను ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనంటూ తన నియోజకవర్గ ప్రజలతో కన్నీటి పర్యంతమయ్యారు. ఇంకో సందర్భంలో పార్టీకి ఓనర్లమంటూ ఈటల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అప్పట్లోనే ఈటలకు, కేసీఆర్ కు గ్యాప్ బాగా పెరిగిందనుకునే టాక్ వచ్చింది. అంతేకాదు ప్రగతి భవన్ కు వెళ్లడం కూడా ఈటల మానేసి చాలా కాలమైంది. కొన్ని కేబినెట్ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కూడా అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు.
పార్టీలో ముందు నుంచి ఉన్న తనకు ప్రాధాన్యత తగ్గడం, అదే సమయంలో ఇతర పార్టీల నేతలు పార్టీలో పెత్తనం చెలాయిస్తుండడం.. ఈటలకు బాధ కలిగించాయి. ఈటలకు పార్టీలోని కొంతమంది సీనియర్లు, కేబినెట్ సహచరులు కూడా మద్దతు పలికారు. ఆ మధ్య కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలిగి కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తారనే టాక్ బలంగా వినిపించింది. ఒకవేళ అదే జరిగితే పార్టీపై ధిక్కార స్వరం వినిపించేందుకు ఈటల నేతృత్వంలో కొంతమంది సిద్ధపడ్డారని టాక్. ఆ విషయం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో కేటీఆర్ కు పట్టాభిషేకాన్ని వాయిదా వేసారని సమాచారం. ఇదే సమయంలో పార్టీలో ధిక్కార స్వరాన్ని సహజంగానే సహించలేని కేసీఆర్.. ఈటల అండ్ కో పై ఓ కన్నేసి ఉంచారు. వాళ్ల లోటుపాట్లన్నీ తెప్పించుకున్నారు. ఎక్కడ దొరుకుతారా అని వెయిట్ చేశారు. ఇప్పుడు ఆ సమయం సందర్భం వచ్చింది. అదను చూసి వేటు వేశారు.
అయితే కేసీఆర్ తమను టార్గెట్ చేశారనే విషయం ఈటల అండ్ కోకు ముందు తెలుసు. అందుకే తెరవెనుక వారి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే తామే బయటకు రావాలని అనుకున్నారు కానీ ఇలా బహిష్కరణకు గురవుతామని బహుశా వాళ్లు కూడా ఊహించకపోయి ఉండొచ్చు. ఏదైతేనేం.. ఎప్పటికైనా టీఆర్ఎస్ తమది కాదనే విషయం ఈటల ముందే గ్రహించారు. తమ దారి తాము చూసుకుంటే బెటర్ అనుకున్నారు. దీనికి ప్రిపేర్ అయ్యే ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో ఘాటుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈటల ఏం చేస్తారనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న అంశం. కొత్త పార్టీ పెట్టబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒక వేళ పార్టీ పెట్టకపోతే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలు ఈటలను స్వాగతిస్తాయి. కానీ ఈటల వేరే పార్టీల్లోకి వెళ్లకపోవచ్చని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరి చూద్దాం.. ఆయన తదుపరి మజిలీ ఎలా ఉంటుందో!













