కరోనా నిబంధనలు సీఎం సభకు వర్తించవా?
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల ఆరోగాన్ని టీఆర్ఎస్ పణంగా పెట్టిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. నల్గొండలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనుములలో కేసీఆర్ బహిరంగ సభ బాధ్యతారాహత్యమని మండిపడ్డారు. సాగర్ ప్రజలు టీఆర్ఎస్కు కచ్చితంగా గుణపాఠం చెబుతారని అన్నారు. ఉప ఎన్నికలో జానారెడ్డి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంబేడ్కర్ జయంతి రోజే దళితులను టీఆర్ఎస్ అవమానపరిచిన విషయం సాగర్ నియోజకవర్గ ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కోరారు. టీఆర్ఎస్ పాలనతో ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సమావేశానికి డబ్బులు ఇచ్చి ప్రజలను తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ సభకు ప్రజలు వచ్చి కరోనా అంటించుకోవాలా? అని అన్నారు. కరోనా నిబంధనలు సీఎం సభకు వర్తించవా? అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులు పోలీసులచే కాంగ్రెస్ నాయకులను అణచివేతకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.













