రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే.. బీజేపీకి : నిర్మలా సీతారామన్
తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్‌లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని విపక్ష నేతలు సైతం కొనియాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని ఆరోపించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. హైదరాబాద్‌లో ఎప్పట్నుంచో ఉన్న పరిశ్రమలు చూపిస్తున్నారు తప్ప ఇతర జిల్లాల్లో అభివృద్ధి జరగలేదు అని ఆరోపించారు.













