తెలంగాణ అసెంబ్లీలో ముగిసిన టీడీపీ కథ
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ కథ ముగిసింది. ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎమ్మెల్యేలను గెలుచుకున్న ఆ పార్టీ ఉనికిని కాపాడుకుంది. అయితే.. ఇప్పుడు ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆ పార్టీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు గులాబి కండువా కప్పుకున్నారు. అంతేకాక.. పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే స్పీకర్ కూడా టీడీపీఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లు ధృవీకరించారు. దీంతో అసెంబ్లీలో టీడీపీ పూర్తిగా కనుమరుగైపోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ లేని రాజకీయాలను ఊహించలేం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఓ సారి అధికారంలోకి రాగా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. కానీ విభజన తర్వాత తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పలేదు. 2014 ఎన్నికల్లో 15మందికి పైగా ఎమ్మెల్యేలను గెలుచుకున్న తెలుగుదేశం తన పట్టును నిలుపుకోలేకపోయింది. అప్పుడు మెజారిటీ సభ్యులు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. దీంతో టీడీపీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది.
2019 ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలను గెలుచుకుంది. ఆ రెండు స్థానాలు కూడా దక్కవేమో అని అందరూ భావించారు. అయితే టీడీపీకి ఎప్పటి నుంచో కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య., అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వర రావు గెలుపొందారు. ఆ సీట్లను చూసి కొందరు ఆశ్చర్యపోయారు. ఇంతటి వ్యతిరేకతలో కూడా రెండు స్థానాలను టీడీపీ గెలుచుకోవడం గొప్ప విషయమే అన్నట్టు చూశారు.
అయితే ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. తెలంగాణలో పార్టీ మనుగడ కష్టంగా మారడంతో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కానీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు మాత్రం తాను టీడీపీలోనే కొనసాగనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నారు. అంతేకాక.. వెంటనే స్పీకర్ ను కలిసి టీడీపీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీన చేయాలని లేఖ అందించారు. ఆ వెంటనే స్పీకర్ కూడా విలీనాన్ని ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.













