తుమ్మల ప్రస్థానం అటువైపేనా..?
ఖమ్మం రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో తలపండిన తుమ్మలకు .. రాష్ట్ర విభజన తర్వాత గడ్డుకాలం దాపురించింది. విభజన తర్వాత గులాబీదళంలో కలిసినా.. తుమ్మలకు తగిన ప్రాధాన్యం దక్కలేదనే చెప్పాలి. అయితే రాజకీయ ప్రాధాన్యం దక్కకున్నా తుమ్మల మాత్రం.. పాలేరు సహా పలుప్రాంతాల్లో అభివృద్ధికి నిర్విరామ కృషి చేశారు. అంత సీనియారిటీ ఉన్న తుమ్మలకు.. ఈసారి టికెట్ దక్కలేదు. దీంతో తుమ్మల అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
తుమ్మలకు టికెట్ఇవ్వకపోవడంతో ఆయన వర్గం ఇప్పటికే రహస్య సమావేశాలు నిర్వహించింది. అటు తర్వాత హైదరాబాద్ వెళ్లి తుమ్మలను కొందరు నేతలు కలిశారు. తర్వాత తుమ్మల బలప్రదర్శన చేశారు. హైదరాబాద్ నుంచి వెయ్యికి పైగా కార్లతో ర్యాలీగా తుమ్మల .. ఖమ్మం చేరుకున్నారు. అంతేనా తన అనుచరులు, అభిమానులతో కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తుమ్మల.. భావోద్వేగంతో మాట్లాడారు. తనకు పదవులు అక్కర్లేదని.. ప్రజాశీర్వాదంతో, సంక్షేమ పనుల కోసం తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని, కొనసాగుతానన్నారు.
ప్రస్తుతం తుమ్మల.. మళ్లీ పాలేరు నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పాలేరు సహా పరిసరప్రాంతాల్లో తాను చేపట్టిన అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయన్నది తుమ్మల భావనగా కనిపిస్తోంది. వాస్తవానికి ఖమ్మంలో బలమైన వర్గాల్లో తుమ్మల, పొంగులేటి, పువ్వాడ ప్రధానంగా ఉన్నారు. ఇందులో ఇప్పటికే పొంగులేటి తనదారి తాను చూసుకున్నారు. ఇప్పుడు తుమ్మల కూడా .. బీఆర్ఎస్ ను వీడతారని తెలుస్తోంది. తుమ్మల ర్యాలీ, సమావేశంలో సైతం బీఆర్ఎస్ జెండా కనిపించకపోవడం.. దీనికి బలం చేకూరుస్తోంది.
మరోవైపు…తుమ్మల సంఘీభావ ర్యాలీలో కాంగ్రెస్ జెండాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అంటే తుమ్మల.. కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తుమ్మల అభిమానులు, అనుచరులు… కాంగ్రెస్ లోచేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. రేణుకా చౌదరి లాంటి కాంగ్రెస్ సీనియర్లు సైతం .. తుమ్మల వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని బహిరంగ ప్రకటన చేశారు. అంటే తుమ్మల కాంగ్రెస్ లో అడుగుపెడితే.. ఆయన రాకను వ్యతిరేకించే వారు కనిపించడం లేదని చెప్పొచ్చు. మరి దీనికి పొంగులేటి వర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.













