సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ సిగపట్లు!
నాగార్జున సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉపఎన్నిక హీటెక్కిస్తోంది. ప్రచారానికి ఇంక రెండ్రోజులే సమయం ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ కూడా ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధాన పోరు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యే నెలకొంది. ఆ రెండు పార్టీలూ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. మంగళవారం ప్రచారం సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
టీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపుకోసం టీఆర్ఎస్ శ్రేణులన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మండలాలవారీగా మంత్రులను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు పార్టీ అధినేత కేసీఆర్. జిల్లా నేతలంతా సాగర్ లోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి సొంతూరు అనుములకు ప్రచారానికి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
టీఆర్ఎస్ నేతలను ఊళ్లోకి రానివ్వకుండా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. తమ గ్రామంలో ప్రచారం నిర్వహించొద్దంటూ స్థానికులంతా అడ్డు చెప్పారు. జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. పరిస్థితి ఎంతకూ సర్దుకోకపోవడంతో జయవీర్ రెడ్డి జీపు టాప్ ఎక్కి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులకు, జయవీర్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే పోలీసులు జోక్యం చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.
అయితే అంతకుముందు కాంగ్రెస్ నేతలు హాలియా వైపు జీపులో వెళ్తుండగా.. టీఆర్ఎస్ శ్రేణులు జైతెలంగాణ నినాదాలు చేస్తూ కారును అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం జానారెడ్డి కుమారుడికి తెలియడంతో.. తమ ఊరికి ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో మంగళవారం ఇరుపార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే జానారెడ్డి రౌడీయిజం చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.













