రసవత్తరంగా సాగర్ సమరం
నాగార్జున సాగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. ఇవాల్టితో నామినేషన్ల గడువు ముగుస్తోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీఆర్ఎస్, బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. చివరి వరకూ అభ్యర్థిని ప్రకటించకుండా గోప్యత పాటించాయి. టీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ భావించింది. అలాగే.. బీజేపీ కేండిడేట్ ను అనౌన్స్ చేస్తే తమ అభ్యర్థిని ఖరారు చేద్దామని టీఆర్ఎస్ భావించింది. అయితే నామినేషన్లకు ఒకరోజు ముందే టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది. ఆ వెంటనే బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించింది.
ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారబరిలోకి దిగిపోయారు కేండిడేట్స్. ఇక్కడ టీఆర్ఎస్ సెంటిమెంటుకే మొగ్గు చూపింది. చనిపోయిన నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ కే సీటు కేటాయించింది. నియోజకవర్గంలో మంచి పేరుండడం, విద్యావంతుడు కావడం.. భగత్ కు కలిసొచ్చే అంశాలు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, నర్సింహయ్య సెంటిమెంట్ వర్కవుట్ అవుతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అసమ్మతులను కట్టడి చేసేందుకు టీఆర్ఎస్ ఇక్కడ చివరి వరకూ వెయిట్ చేసింది. కమ్యూనిస్టుల అండ కూడా తమకే ఉంటుందని నోముల కుటుంబం ఆశిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ ప్రతి మండలానికీ ఇన్ ఛార్జ్ లను నియమించి.. పార్టీ గెలుపు కోసం వ్యూహరచన చేసింది.
ఇక బీజేపీ తరపున డాక్టర్ రవి కుమార్ నాయక్ బరిలోకి దిగుతున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా నియోజకవర్గంలో వైద్యుడిగా మంచి పేరుంది. ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారాయన. గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం బీజేపీకి కలిసొచ్చే అంశం. నియోజకవర్గంలో సుమారు 40వేల గిరిజన ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లతో గెలుపు సాద్యం కాకపోయినా భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి తప్పకుండా దోహదపడుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. గిరిజన ఓట్లను చీల్చడం ద్వారా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయొచ్చని కమలం నేతలు భావిస్తున్నారు. అయితే బీజేపీలో అసంతృప్తి సెగ మొదలైంది. రెబెల్ గా బరిలోకి దిగేందుకు అంజయ్య యాదవ్ సిద్ధమయ్యారు.
ఇక కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దలు జానారెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ మొదట అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. జానారెడ్డి వ్యక్తిగత ఇమేజ్ పైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. నియోజకవర్గంలో మంచి పట్టుండడం జానారెడ్డికి కలిసొచ్చే అంశం. అయితే అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు చిన్నాభిన్నమైపోయాయి. జానారెడ్డి గెలిచినా పెద్ద ఉపయోగం ఉండదనే భావన ఇక్కడి శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే ఇవే తన చివరి ఎన్నికలని జానారెడ్డి సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. తనకు చివరి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బహుశా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయితే జానారెడ్డికి విజయావకాశాలు ఉంటాయి. త్రిముఖ పోరులో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా. ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉండనుంది.













