సాగర్ లో టీఆర్ఎస్ కు ట్రాక్టర్ టెన్షన్!
అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక రూపంలో టెన్షన్ పట్టుకుంటోంది. గెలుస్తామనే ధీమా ఉన్నా ఏదో ఒక రూపంలో ఆ పార్టీకి కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఇలాంటి ఒత్తిడినే ఎదుర్కొంది. తాజాగా నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కూడా టీఆర్ఎస్ కు గుర్తుల టెన్షన్ పట్టుకుంది. గత ఎన్నికల్లో గుర్తుల కన్ఫ్యూజన్ ద్వారా గెలుపోటములు ప్రభావితమైన సంఘటనలు ఉండడంతో సాగర్ లో కూడా అలాంటి పరిస్థితులు పునరావృతమవుతాయేమోననే టెన్షన్ గులాబిదళంలో మొదలైంది.
నాగార్జున సాగర్ బైపోల్ ను టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో పనిచేసింది. ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మంచి పట్టున్న నియోజకవర్గం కావడంతో ఎలాంటి చిన్నపొరపాటు చేయకూడదని భావించింది. అందుకే మండలాలవారీగా పార్టీ శ్రేణులను మోహరించి ప్రచారం సాగించింది. పోలింగ్ ముగిసిన తర్వాత టీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ జోష్ లో కనిపించాయి. మండలాలవారీగా అంచనాలు చూసిన తర్వాత గెలుపు ఖాయమనే నిర్ణయానికి వచ్చాయి. అయితే ఇదే సమయంలో ఆ పార్టీ శ్రేణులకు ఓ టెన్షన్ మొదలైంది. తమ కారుకు పోలిన ట్రాక్టర్ గుర్తు ఒకటి ఈవీఎంలో ఉన్నట్టు గుర్తించారు క్షేత్రస్థాయి కార్యకర్తలు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ శ్రేములకు టెన్షన్ మొదలైంది.
టీఆర్ఎస్ గుర్తు కారు. ఆ పార్టీ తరపున నోముల భగత్ నాగార్జున సాగర్ బరిలో నిలిచారు. ఈవీఎం వరుస క్రమంలో మూడో స్థానంలో ఉంది కారు గుర్తు. దాని కిందే ఐదో స్థానంలో ట్రాక్టర్ గుర్తు కూడా ఉంది. మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థి అడెపు నాగార్జునకు ఆ సింబల్ కేటాయించింది ఎన్నికల సంఘం. కారును పోలినట్లే ట్రాక్టర్ గుర్తు ఉండడం.. అది కూడా మొదటి ఈవీఎంలోనే దగ్గరదగ్గరగా ఉండడంతో కన్ఫ్యూజ్ అయ్యామని కొంతమంది ఓటర్లు చెప్పారు. దీంతో ఇది తమ కొంప ముంచుతుందేమోనని టీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. చదువుకున్నోళ్లే తాము కన్ఫ్యూజ్ అయ్యామని చెప్తున్నారు. మరి మహిళలు, వృద్ధులు, చదువుకోనివారు ఇంకెంత కన్ఫ్యూజ్ అయ్యారోనని ఆందోళన చెందుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ కారుకేమైనా డ్యామేజ్ చేసిందేమోనని టెన్షన్ పడ్తున్నారు.
దుబ్బాకలో కారు గెలుపును చపాతీ రోలర్ అడ్డుకుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ బైపోల్ లో కూడా చపాతీ రోలర్ గుర్తు ఉంది. కానీ అది మొదటి ఈవీఎంలో లేకపోవడంతో ఆ గుర్తుపై పెద్దగా ఆందోళన చెందట్లేదు. అయితే దుబ్బాకలో చపాతీ రోలర్ వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అయి కారుకు బదులు ఆ గుర్తుకు ఓటేశారు. దీంతో అక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది. గతంలో నకిరేకల్, హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు కారు గెలుపును అడ్డుకుంది. గతానుభవాలు గులాబీశ్రేణులను ఇప్పుడు తెగ ఇబ్బంది పెడ్తున్నాయి. మరి ఈ ఆందోళనకు తెరపడాలంటే మే 2వరకూ ఆగాల్సిందే.!













