పవర్ ఫైట్…
వ్యవసాయానికి ఉచిత కరెంటుపై తెలంగాణలో రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత కరెంటుపై వ్యాఖ్యలపై… రైతులకు బేషరతు క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతే కాదు.. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ కు వ్యతిరేకమంటూ ప్రచారాన్ని సాగిస్తోంది. ఊరూరా ఆందోళనలు చేస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనుండడంతో .. ఈ కొన్నినెలల పాటు దీనిపైనే ప్రజల ఫోకస్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. పనిలో పనిగా సోనియాగాంధీ సైతం.. ఉచిత విద్యుత్ కు వ్యతిరేకమంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.
ఈ పరిణామాలతో తొలుత డిఫెన్స్ లో పడిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. నెమ్మదిగా అఫెన్సివ్ మూడ్ లోకి వచ్చేశారు. అసలు ఉచిత విద్యుత్ విధానం ప్రారంభించిందే కాంగ్రెస్ అంటూ.. అదే విధానాన్ని కొనసాగిస్తున్నామన్నారు. అంతే కాదు.. ఇక్కడ ఏ ఒక్కనేత అభిప్రాయం చెల్లదని హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటూ రేవంత్ ప్రకటన తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు.. విపక్షంపై అధికార పక్షం ఆందోళనలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇక కోమటిరెడ్డి లాంటి లీడర్లైతే సబ్ స్టేషన్లకు వెళ్లి మరీ అక్కడి ఫైల్స్ పరిశీలించి.. అక్కడి నుంచే బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎక్కడా 24 గంటల పాటు ఉచిత కరెంటివ్వడం లేదంటున్నారు. అంతే కాదు.. ఇచ్చే కరెంటు కూడా లోటు కరెంటుగా ఉంటోందని.. దాంతో సాగు కష్టమవుతోందని చెబుతున్నారు. దీంతో పాటు 24 గంటలపాటు కరెంటిచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. లేకుంటే మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని ఇప్పటికే కోమటిరెడ్డి సవాల్ విసిరారు.
ఈ వివాదానికి కేంద్రబిందువైన రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. నిజంగా 24 గంటలపాటు ఉచిత కరెంటు ఇచ్చామని బీఆర్ఎస్ భావిస్తే.. 24 గంటల కరెంటు ఇచ్చినచోట తామ ఓట్లు అడగబోమన్నారు. ఇవ్వని చోట్ల బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దని సవాల్ విసిరారు. దీంతో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు … వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కాంగ్రెస్ నేతలు.. ఒకటి, రెండు ప్రకటనలతో సరిపుచ్చేవారు. కానీ ఇప్పుడు మూకుమ్మడిగా విరుచుకుపడడం చూస్తే… కాంగ్రెస్ లో పోరుపటిమ ఇనుమడించినట్లు కనిపిస్తోంది.













