మానవీయకోణంలో..
ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం ఓ మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థుల కడుపునింపేలా అల్పాహార పథకాన్ని అమలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ అనితారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. దీని ద్వారా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అల్పాహార పథకం తీసుకొచ్చారని తెలిపారు. దీంతో పిల్లల తల్లిదండ్రులపై భారం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంతో డ్రాపౌట్స్ గణనీయంగా తగ్గుతాయని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు కొన్ని రోజులు కోడిగుడ్డు ఇవ్వడం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనేనన్నారు. రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలతో పాటు బాలికల కోసం 70కిపైగా గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు.
ఈ పథకాన్ని దసరా తర్వాత అన్నిచోట్ల అమలు చేస్తామన్నారు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో అదనపు కలెక్టర్లకు అప్పగిస్తామన్నారు. విద్యాశాఖ, పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి మంత్రులిద్దరూ అల్పాహారం తిన్నారు. వారికి స్వయంగా ఇడ్లీ తినిపించారు. కాసేపు వారితో ముచ్చటించారు.
ఎన్నికల సంగతి పక్కన పెడితే ఈపథకం ద్వారా … నిరుపేద విద్యార్థులకు కాస్త ఉపశమనం లభిస్తుందని చెప్పొచ్చు. ఖాళీ కడుపుతో, కాసిన్ని మంచినీళ్లు తాగి… ఒంటిపూటతో బతుకు బండి లాగించే చిన్నారులకు.. స్కూల్లో అల్పాహారం కడుపు నింపనుంది. ఎలాగూ మధ్యాహ్న భోజన పథకం కూడా ఉండనే ఉంది. దీంతో రెండుపూటలా చిన్నారులకు తిండి దొరుకుతుంది. ఫలితంగా స్కూళ్లకు వెళ్లే చిన్నారుల సంఖ్య పెరిగే అవకాశముంది.
అయితే ఇదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలపైనా దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని .. చిన్నారుల తల్లితండ్రులు కోరుతున్నారు. స్కూళ్లలో బుక్స్ నుంచి ఉపాధ్యాయుల వరకూ ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మంచితిండి, చక్కని విద్య లభిస్తే.. తమ పిల్లలు ఉన్నతస్థానాలకు చేరుకుంటారని, ఆదిశగా బాటలు వేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.













