వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన కొనసాగనున్నది. వచ్చే విద్యా సంవత్సరంలో (జూన్) ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన ప్రారంభించేందుకు విద్యాశాఖ ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందాలంటే ఇంగ్లిష్ మీడియం అవసరమని ఇటీవల సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం తెలుగు మీడియం కొనసాగుతున్న 15,370 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనుంది. తెలుగుతో సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం సెక్షన్లను ప్రారంభించి ఆసక్తి ఉన్న విద్యార్థులు చేరేలా చర్యలు చేపట్టనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,754 పాఠశాలలు ఉన్నాయి. అందులో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకులాలు, ఇతర పాఠశాలలు ఉన్నాయి. అవి పోగా 26,072 తెలుగు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ఉన్నాయి. అందులో ఇప్పటికే 10,702 స్కూళ్లలో తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియం కొనసాగుతోంది. మరో 15,370 స్కూళ్లలో పూర్తి స్థాయిలో తెలుగు మీడియం మాత్రమే కొనసాగుతోంది. సీఎం ఆదేశాలతో ఇప్పుడు వాటిన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను సమాంతరంగా ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.













