మళ్లీ ‘పోడు’ టెన్షన్
సీఎం కేసీఆర్.. పోడు సమస్యను తీర్చేశారని భావించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు.. ఇప్పుడు మరిన్ని తలనొప్పులు తయారయ్యాయి. ఓ వైపు పట్టాలు పంపిణీ చేస్తున్నా, మరోవైపు పట్టాలు అందని వారు, అర్హుల లిస్టులో పేరు లేని వారు ఆందోళనలు చేస్తున్నారు. అనర్హులకు పట్టాలిస్తున్నారని, అధికార పార్టీ నేతల ప్రమేయంతో ఆ పార్టీకి చెందిన వారికే అందజేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం మూడో వంతు మందిని మాత్రమే అర్హులుగా గుర్తించడంతో, మిగిలిన వారు ఎక్కడ తమకు వ్యతిరేకంగా మారుతారోనని లీడర్లు టెన్షన్ పడ్తున్నారు. రోజూ ఏదో ఒక చోట పోడు పట్టాల గురించి నిరసనలు, ఆందోళనలు కొనసాగుతుండడం, గిరిజన సంఘాల నేతలు కూడా మళ్లీ ఉద్యమాలు చేస్తామని చెప్తుండడంతో పోడు పోరు ఇప్పట్లో చల్లారేలా కన్పించడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా 2.59 లక్షల మంది, 8.14 లక్షల ఎకరాల కోసం చేసుకున్న క్లెయిమ్‌లను ఆఫీసర్లు తిరస్కరించారు. 4.70 లక్షల ఎకరాలను క్లెయిమ్ చేస్తూ 1.80 లక్షల మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకోగా, వారిలో ఒక్కరికీ కూడా పట్టాలు మంజూరు కాలేదని తెలుస్తోంది.అసలు ఎందుకు తిరస్కరించారో కారణాలు చెప్పకపోవడంపై గిరిజనుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్వే చేయకపోవడం, ఎక్కువ విస్తీర్ణంలో సర్వే చేసినా కేవలం గుంటల్లో మాత్రమే తక్కువ విస్తీర్ణానికి పట్టా ఇవ్వడంపై గిరిజన సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలకు రెడీ అవుతున్నారు. రీ సర్వే చేసి, అర్హులైన అందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా , భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సహా పలు జిల్లాల్లో ఈ తరహా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ విషయంపై దశలవారీగా ఆందోళనలు చేస్తామని గిరిజన సంఘాల నేతలు చెబుతున్నారు.. ముందుగా ప్రభావిత ప్రాంతాల్లో రైతులతో సదస్సులు నిర్వహిస్తాం. ఆ తర్వాత ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేస్తాం. గిరిజనులను ఇబ్బంది పెట్టేలా ఫారెస్ట్, ఐటీడీఏ ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను కలవాలని చెప్పడం, పట్టాల కోసం జాబితాలో పేరుండేలా చూస్తామని ఎకరానికి రూ.5 వేల చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారు. కేసులు ఎత్తివేస్తున్నామని నామమాత్రపు ప్రకటనలకే పరిమితమయ్యారని ఆరోపించారు.
మరోవైపు ఇప్పటికే పోడు సమస్యలో కీలకంగా ఉన్న విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ…. వీరికి సంఘీభావం ప్రకటిస్తున్నాయి. తాము మొదటి నుంచి చెప్పినట్లే… బీఆర్ఎస్ నేతలు వారికి అనుకూలంగా ఉన్నవారికే పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఏదో కొద్దిమందికి ఇచ్చి, అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని కేసీఆర్ తీరుపై మండిపడుతున్నాయి. ఇది ఎన్నికల స్టంట్ గానే మిగిలిపోతుందని ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ హామీ ఇచ్చిన విధంగా అర్హులకు పోడు పట్టాలు అందిస్తామని భరోసా ఇస్తున్నారు.













