‘ఓట్ల పండుగ’ ముగిసింది..
తెలంగాణ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పల్లెల్లో చైతన్యం వెల్లివిరియగా… పట్నం మాత్రం బద్దకించింది. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 70.66 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల వివరాలను ఇంకా లెక్కలో చేర్చలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలో కేవలం 46.56 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03 శాతం రికార్డయింది. తదుపరి స్థానాల్లో మెదక్ (86.69), జనగామ (85.74), నల్గొండ (85.49), సూర్యాపేట (84.83%) జిల్లాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో గరిష్ఠంగా 91.51 శాతం, యాకుత్‌పురలో అత్యల్పంగా 39.69 శాతం నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో 73.37 శాతం ఓటింగ్ నమోదైంది.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినినగర్‌లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాలులో మంత్రి కేటీఆర్ దంపతులు, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు దంపతులు ఓటు వేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఏమధిరలో, గవర్నర్లు దత్తాత్రేయ ముషీరాబాద్‌లో, ఇంద్రసేనారెడ్డి మలక్‌పేటలో, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో, డాక్టర్ లక్ష్మణ్ ముషీరాబాద్‌లో, బండి సంజయ్ కరీంనగర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, గేటెడ్ కమ్యూనిటీ వాసులు, సాఫ్ట్వేర్ తదితర రంగాలకు చెందిన ఉద్యోగులు నగరంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ముఖ్యంగా టెకీలు మాత్రం.. ఓటుహక్కు వినియోగించుకోవడంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికి తోడు ఓటర్లు సైతం తమ సొంత గ్రామాలకు పెద్దసంఖ్యలో తరలివెళ్లడంతో.. సిటీ ఖాళీగా కనింపించింది..మరోవైపు… డబ్బులు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే.. పోలీసులు, ఎన్నికల అధికారులు మాత్రం.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతే కాదు.. కేంద్ర బలగాలు సైతం మోహరించడంతో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటింగ్ ముగిసిన తర్వాత కూడ లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటుహక్కు వినియోగించుకోవడానికి అధికారులు అనుమతించారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అయితే…సాయంత్రం 4 గంటలకే పోలింగ్ పూర్తయింది.
బ్యాలెట్ బాక్సులను అధికారులు స్ట్రాంగ్ రూములకు తరలించారు. స్ట్రాంగ్ రూముల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఏ పార్టీ అధికారంలోకి రానుంది, ఎవరికి ప్రజలు పట్టం కట్టారన్న అంశం ఆరోజునే తేలనుంది. అయితే అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ నేతలు.. తామే అధికారంలోకి వస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.













