తేనె తుట్టెను కదిలించిన రేవంత్..! బయట పడగలరా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి దూకుడు మీదున్నారు. శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ లో అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి. మొదట ఐదు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టారు. వాటిని ఓ కొలిక్కి తీసుకువచ్చారు. ఇప్పడు పాలనపై, పార్టీపై ఫోకస్ పెట్టారు. పాలనాపరంగా తీసుకోవాల్సిన చర్యలపైన ఆయన శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపెడుతూ వస్తున్నారు. మూసీ సుందరీకరణను అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులను కాపాడేందుకు హైడ్రా తీసుకొచ్చి సంపూర్ణ అధికారాలిచ్చారు. అయితే ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
హైడ్రా అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతోంది. ఈ రెండు నెలల కాలంలో హైడ్రా దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. అన్ని విభాగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం, వెనువెంటనే నిర్ణయాలు తీసుకునేలా యంత్రాంగంలో మార్పులు తీసుకురావడంతో పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడమే హైడ్రా మొదటి కర్తవ్యం. ఈ రెండు నెలల్లో దాదాపు 166 ప్రాజెక్టులను టేకప్ చేసినట్లు హైడ్రా వెల్లడించింది. ఇప్పటికీ ఆ టాస్క్ లను కంటిన్యూ చేస్తోంది. నిత్యం ఏదో ఒక చోట హైడ్రా తన పని తాను చేసుకుపోతోంది. దీనిపై ఏం చేయాలో అర్థం కాక చాలా మంది నోరు మెదపట్లేదు.
నాగార్జునకు ఎన్-కన్వెషన్ ను కూల్చేసిన తర్వాత హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు నుంచు కూడా హైడ్రా పనిచేస్తోంది. కానీ ఆ సంఘటన తర్వాతే అందరిలోనూ వణుకు మొదలైంది. నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ పై మొదటినుంచి అనేక ఆరోపణలున్నాయి. కానీ దాని జోలికి వెళ్లేందుకు ఏ ప్రభుత్వమూ సాహసించలేదు. కానీ రేవంత్ రెడ్డి కేవలం గంటల వ్యవధిలోనే దాన్ని నేలమట్టం చేసేశారు. దీంతో పెద్దోళ్లందరూ వణికిపుతున్నారు. నాగార్జునదే కూల్చేసినప్పుడు మనవి కూల్చకుండా ఉంటారా.. అని భయపడుతున్నారు. అందుకే ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
వాస్తవానికి హైడ్రాకు అందుతున్న ఫిర్యాదుల్లో చాలా వరకూ బడాబాబులవే. పెద్దోళ్లే ఎక్కువగా చెరువులను ఆక్రమించి ఫౌంహౌస్ లు, విల్లాలు కట్టుకున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నేతలూ ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఒకరివి కూల్చి మరొకరివి వదిలిపెడితే అది రేవంత్ రెడ్డికి చెడ్డపేరు తీసుకొస్తుంది. ఇంతదాకా వచ్చాక ఇప్పుడు ఆపే పరిస్థికి కూడా లేదు. కచ్చితంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బడాబాబులంతా ఏకమై ఎక్కడ రేవంత్ రెడ్డి సీటు కిందకు ఎసరు తెస్తారోననే భయం కూడా ఉంది. ప్రజల నుంచి హైడ్రా పట్ల సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అయితే వాళ్లు బాధితులు కాదు కాబట్టి నొప్పి తెలీదు. స్వాగతిస్తారు. కానీ నొప్పి భరించేది బాధితులు. వాళ్లు బలవంతులు కావడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.