కాంగ్రెస్లో సునీల్ కనుగోలు రిపోర్ట్ కలకలం..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాల సంగతి తెలిసిన విషయమే. ఇటీవల హైకమాండ్ జోక్యంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. కానీ సమయం వచ్చినప్పుడు మళ్లీ నోరు విప్పేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉంటారు. అయితే నోటికి చెప్పినంత పని చేతల్లో ఉండట్లేదని ఆ పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడవుతోంది. పార్టీకోసం చించుకుని పని చేస్తున్నామని చెప్పుకుంటున్న నేతల పరిస్తితి నియోజకవర్గాల్లో కనిపించడం లేదనేది సునీల్ కనుగోలు చెప్తున్న మాట. ఎన్నికలు సమీపిస్తుండడంతో సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. గతంలో సిఫారసుల మేరకు సీట్లు ఇచ్చుకుంటూ పోయేది. కానీ ఇప్పుడు పూర్తిగా సునీల్ కనుగోలు చెప్పినట్లు చేయాలని భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు తెలంగాణలో ఆ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడంతో సునీల్ కనుగోలుపై ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కర్నాటకలో అనుసరించిన విధానాలనే తెలంగాణలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కర్నాటకలో సిఫారసులతో సంబంధం లేకుండా కేవలం గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించింది. ఆ గెలుపు గుర్రాలను ఐడెంటిఫై చేసే బాధ్యతను సునీల్ కనుగోలు బృందం చేపట్టింది. నియోజకవర్గాల వారీగా వివిధ దశల్లో వివిధ అంశాలపై సర్వేలు నిర్వహించి సీట్లు కేటాయించింది.
ఇప్పుడు తెలంగాణలో కూడా సునీల్ కనుగోలు టీం చేపట్టిన సర్వే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు సునీల్ కనుగోలు రిపోర్ట్ అందజేశారు. దాని ప్రకారం 41 స్థానాల్లో కాంగ్రెస్ గపక్కాగా గెలుస్తుందని తేల్చారు. మరో 42 స్థానాల్లో గట్టి పోటీ ఎదురవుతుందని.. 36 స్థానాల్లో పార్టీ బలహీనంగా ఉందని అంచనా వేశారు. గట్టి పోటీ ఎదురయ్యే స్థానాల్లో గెలిస్తేనే పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని.. ఇందుకోసం నేతలంతా సమష్టిగా పని చేయాల్సిన అవసరం ఉంటుందని సునీల్ కనుగోలు నివేదించారు. అగ్రనేతలుగా కొనసాగుతున్న కొంతమంది నేతల పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏమంత ఆశాజనకంగా లేనట్టు నివేదిక తేల్చింది.
అయితే సునీల్ కనుగోలు టీం ఈ నెలలో కూడా మరోసారి సర్వే చేపట్టనున్నట్టు సమాచారం. ఆ నివేదిక కూడా వచ్చిన తర్వాత సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదటి కేటగిరీలో ఉన్న 41 స్థానాల అభ్యర్థులను ఈ నెలాఖరులోపే ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లు కచ్చితంగా గెలుస్తారని సునీల్ కనుగోలు సర్వే తేల్చడంతో వాళ్ల అభ్యర్థిత్వానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మిగిలిన స్థానాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.













