సైబర్ నేరాల్లో హైదరాబాద్ ‘టాప్’.. ఎన్సీఆర్బీ నివేదికలో విస్తుపోయే నిజాలు!
Hyderabad: దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడుతూ హైదరాబాద్లో నేరాల రేటు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన 2024 నివేదిక ప్రకారం, నగరంలో ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు , చిన్నారులపై జరుగుతున్న అరాచకాలు పెరిగాయి.
చిన్న చిన్న దొంగతనాల నుండి హత్యల వరకు..
తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, ఆన్లైన్ గేమింగ్, , వ్యసనాల కారణంగా చిన్నారులు నేరాల బాట పడుతున్నారు. ముఖ్యంగా 12-14 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలు చిన్న చిన్న దొంగతనాల నుండి హత్యలు, అరాచకాల వరకు పాల్పడుతుండటం గమనార్హం. 2023లో చట్టంతో విభేదించిన బాలల కేసులు 180 నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 316కు చేరింది.
ఇవి కూడా చదవండి
ఆర్థిక, సైబర్ నేరాల్లో టాప్..
ఆర్థిక నేరాల విషయంలో ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో సామాన్యులు సైబర్ మాయగాళ్ల చేతిలో చిక్కి కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. సైబర్ నేరాల్లో నగరం దేశంలోనే మూడో స్థానంలో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మహిళలు, చిన్నారులపై వేధింపులు..
నగరంలోని బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులపై వేధింపులు అధికమవుతున్నాయి. 2024లో నగరంలో 149 లైంగిక వేధింపుల కేసులు, 358 అత్యాచార కేసులు నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తల వ్యాప్తిలో కూడా హైదరాబాద్ దేశంలోనే తొలి స్థానంలో నిలవడం గమనార్హం.
దర్యాప్తులో జాప్యం..
నేరాలు భారీగా నమోదవుతున్నప్పటికీ, వాటిపై ఛార్జిషీట్లు దాఖలు చేయడంలో మాత్రం జాప్యం జరుగుతోందని నివేదిక పేర్కొంది. 2024లో నమోదైన మొత్తం నేరాల్లో కేవలం 56.9 శాతం కేసుల్లోనే ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. పెరుగుతున్న ఈ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇవి కూడా చదవండి








