గొప్ప సాహసం చేసిన రేవంత్..!
తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ట్రై చేస్తోంది. కర్నాటక ఎన్నికల ముందు వరకూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది మూడో స్థానమే అని అందరూ అనుకున్నారు. అయితే కర్నాటక ఫలితాల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. బీజేపీ మూడో స్థానానికి వెళ్లిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనేంతగా ఎగబాకింది. కర్నాటక రిజల్ట్స్ తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు పది శాతం కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగిందని అంచనా. అదే తెలంగాణలో మరింత మెరుగుపడి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిన ఓ సర్వే సంచలనం కలిగిస్తోంది.
నిన్న మొన్నటివరకూ ఇక్కడ బీఆర్ఎస్ తో బీజేపీ పోటీ పడేది. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, నేతల మధ్య మనస్ఫర్థల వల్ల ఆ పార్టీకి అంత సీన్ లేదనే ఫీలింగ్ ఉండేది. కాంగ్రెస్ ను గాడిలో పెట్టడం ఎవరి వల్లా కాదనేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పొంగులేటి, జూపల్లి లాంటి నేతలు బీజేపీలో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారు. అలాంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పట్ల పరిస్థితి ఏ మేరకు టర్న్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
కానీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని భావిస్తున్నారు. ఇటీవల ఆయన ఒక సర్వే విడుదల చేశారు. సాధారణంగా పార్టీ నేతలెవరైనా తమ పార్టీయే గెలుస్తుందని.. ప్రత్యర్థిని ఓడించబోతున్నామని చెప్తుంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్, బీజేపీ చెప్తుంటాయి..! కానీ రేవంత్ రెడ్డి విడుదల చేసిన సర్వేలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చెరో 45 సీట్లు వస్తాయని చెప్పారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెరో 7 స్థానాలు వస్తాయన్నారు. జనరల్ గా ఏ సర్వే అయినా తమకు అనుకూలంగా ప్రొజెక్ట్ చేసి చెప్పుకుంటూ ఉంటాయి పార్టీలు. కానీ రేవంత్ రెడ్డి అలా చేయలేదు.
రేవంత్ బీఆర్ఎస్, కాంగ్రెస్ లను సమానంగా చూపడంతో ఇవి వాస్తవానికి దగ్గరగా ఉన్నా నమ్మకం కలిగింది చాలా మందికి. అలా కాకుండా కాంగ్రెస్ కు 70-80 సీట్లు వస్తాయని, పార్టీ గెలవబోతోందని చెప్పి ఉంటే ఎవరూ నమ్మేవాళ్లు కాదు. కానీ రేవంత్ అలా చేయలేదు. వాస్తవాలకు దగ్గరైన ఫలితాలను చూపించారు. తాము ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. అప్పుడే అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉందని పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తో సమానంగా ఉన్నందున కొంచెం కష్టపడితే అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాబోదనే ధీమా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఇలా అప్పుడప్పుడు వాస్తవాలు మాట్లాడుకుంటే మంచిదే.! దానికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు చేసుకుంటా మెరుగైన ఫలితాలు రాబట్టుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.













