కాంగ్రెస్ ‘బస్సు యాత్ర’…
సర్వేలు కాంగ్రెస్ కు బూస్టిచ్చినట్లే కనిపిస్తున్నాయి. కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు.. తెలంగాణలో అధికారం ఖాయమన్న సర్వే రిపోర్టులు, నేతల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని నిజం చేయాలని హైకమాండ్ కూడా గట్టిగా భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో ఈనెల 15వ తేదీనుండి రాష్ట్రంలో బస్సుయాత్ర మొదలుపెట్టాలని పార్టీ డిసైడ్ చేసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేయాలని, అందులో సీనియర్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నేతలుండేట్లుగా పార్టీ చర్యలు తీసుకుంటోంది.
15వ తేదీన మొదలయ్యే యాత్రలో రెండు రోజుల పాటు ప్రియాంక గాంధీ పాల్గొంటారు. యాత్రను ప్రారంభిస్తున్న ప్రియాంక రెండు రోజులు బస్సు యాత్ర చేయబోతున్నారు. ఈ రెండు రోజుల్లో రెండుమూడు రోడ్డుషోలను కూడా నిర్వహించనున్నారు. రోడ్ షోల్లో ప్రియాంక..ప్రజలతో మాట్లాడనున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. 18, 19 తేదీల్లో రాహుల్ రాబోతున్నారు. రాహుల్ కూడా రెండురోజులు బస్సుయాత్రలో పాల్గొంటారు. మళ్ళీ రోడ్డుషోలు, స్పీచులుంటాయి.
వీళ్ళిద్దరి యాత్రలు అయిపోయిన తర్వాత 20,21 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రెండురోజులు బస్సుయాత్రలో పాల్గొనబోతున్నారు. బస్సుయత్ర పూర్తయ్యే లోపు ఇంకెంతమంది అగ్రనేతలు యాత్రల్లో పాల్గొంటారో తెలీదు. అంటే ఈ ఎన్నికల సమయంలో రాష్ట్రంపై పార్టీ హైకమాండ్ గట్టిగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మొన్నటి కర్నాటక ఎన్నికల్లో కూడా ప్రియాంక, రాహుల్ పదేపదే అక్కడ పర్యటించారు. పర్యటించటమే కాకుండా రోడ్డుషోలు, బహిరంగసభల్లో కూడా పాల్గొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్.. కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్… తెలంగాణలో చాపకింద నీరులా పార్టీ కార్యక్రమాలు చక్కబెడుతున్నారు. అసంతృప్తులతో మాట్లాడుతున్నారు. కలుపుకుపోవాల్సిన నేతలను పిలిపించి, చర్చిస్తున్నారు. పొరుగు రాష్ట్రం కావడం, రాజశేఖరరెడ్డి కాలం నుంచి ఇక్కడి నేతలతో పరిచయాలుండడంతో.. డికె చక్రం తిప్పుతున్నారు. దీంతో అంతర్గతంగా పార్టీని పటిష్టపరచడం కూడా జరుగుతోంది. ఫలితంగా తెలంగాణలో పార్టీ … కొన్నేళ్లతో పోలిస్తే అత్యంత పటిష్టంగా మారినట్లు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు.. ప్రత్యర్థి పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది.













