ప్రియాంక, డీకేలకు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు..!
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే తెలంగాణ ఇచ్చింది తమ పార్టీయే అయినా ఇప్పటివరకూ అధికారం మాత్రం దక్కలేదని కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తారస్థాయిలో ఉందని.. కచ్చితంగా తమకు అధికారం దక్కుతుందని నమ్మకంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. వీటిని సెట్ చేసేందుకు రాష్ట్ర నేతల వల్ల కావట్లేదు. అందుకే ఏకంగా హైకమాండే రంగంలోకి దిగుతోంది. ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్ తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. నేతల మధ్య విభేదాలను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటోంది. వీటి వల్లే పార్టీ పతనమైందని.. ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షిస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని హైకమాండ్ గ్రహించింది. అందుకే నేతలందరికీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. ఎంతటి నేతలైనా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని.. ఎలా కాదని ఎవరైనా ప్రవర్తిస్తే వేటు ఖాయమని హెచ్చరించింది. పార్టీ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించే వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని కూడా రాహుల్ గాంధీ తేల్చి చెప్పేశారు. దీంతో ఇటీవల కాంగ్రెస్ నేతల్లో మార్పు కనిపిస్తోంది.
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలయ్యే వరకూ ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్ పార్టీ సమన్వయ కర్తలుగా వ్యవహరించాలని హైకమాండ్ సూచనప్రాయంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ప్రియాంక గాంధీ పార్టీలో అంతర్గత విభేదాలు, పునఃనిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు. నేతల మధ్య సమన్వయం ఆమె చూసుకోనున్నారు. ఎక్కడైనా విభేదాలుంటే పిలిచి మాట్లాడనున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైకమాండ్ నేరుగా జోక్యం చేసుకుంటే తప్ప నేతలు వినేలా లేరు. అందుకే ప్రియాంక గాంధీయే నేరుగా నేతలతో చర్చించనున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
ఇక డీకే శివకుమార్ పూర్తిగా ఎన్నికల స్ట్రాటజీపై దృష్టి సారించనున్నారు. కర్నాటకలో పార్టీ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టో ఎంతో దోహదపడింది. ఇక్కడ కూడా ఆ స్ట్రాటజీనే అమలు చేయాలని పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సూచించారు. పార్టీ కార్యక్రమాల అమలు, మేనిఫెస్టే రూపకల్పన, ఎన్నికల ఖర్చు.. లాంటి బాధ్యతలను డీకే శివకుమార్ తన భుజాలకు ఎత్తుకోనున్నారు. తెలంగాణలోని పలువురు నేతలతో డీకే శివకుమార్ కు సత్సంబంధాలున్నాయి. సునీల్ కనుగోలు సూచనల మేరకు డీకే శివకుమార్ పనిచేస్తారు. వీళ్లిద్దరూ కలిసి పార్టీకి దిశానిర్దేశం చేసేలా హైకమాండ్ ప్రణాళిక రూపొందించింది.













