జనవరి 3న సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
వచ్చే ఏడాది జనవరి 3న హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించే 105 భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే సమావేశాల్లో దేశ, విదేశాలకు చెందిన పరిశోధకులు, శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్యారంగాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి, పరిష్కార మార్గాల్ని సూచిస్తారని భారత సైన్స్ కాంగ్రెస్ సంఘం (ఐఎస్‌సీఏ) జనరల్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న డా.మనోజ్‌కుమార్ చక్రవర్తి తెలిపారు. ప్రధాని మోదీ జనవరి 3న సదస్సును ప్రారంభిస్తారన్నారు. జూనియర్ శాస్త్రవేత్తల్ని ప్రోత్సహిస్తామనీ, చిన్నారుల, డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి శాస్త్రీయ నమూనాల్ని ఆహ్వానించే ప్రతిభాన్వేషణ కార్యక్రమం కూడా ఉంటుందని ఐఎస్‌సీఏ ప్రధాన కార్యదర్శి గంగాధర్ వెల్లడించారు.













