నాగార్జున సాగర్ లో నువ్వా..నేనా..?
నాగార్జున సాగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 30వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 3 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. పోలింగ్ ఏప్రిల్ 17న జరుగుతుంది. మే 2న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు దీని కౌంటింగ్ కూడా ఉంటుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో నాగార్జున సాగర్ కు ఉపఎన్నిక అనివార్యమైంది. ఇది సిట్టింగ్ సీటు కావడంతో ఎలాగైనా నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఇక్కడ ఆశావహులు భారీగా ఉన్నారు. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ కు టికెట్ ఖరారు కావచ్చని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను పరిశీలించాక ఫైనల్ గా అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. నోముల భగత్ కాకుంటే తేరా చిన్నపరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ దక్కచ్చు.
ఇక కాంగ్రెస్ తరపున సీనియర్ నేత జానారెడ్డి పేరు ఖరారైంది. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే జానారెడ్డి పేరును ఖరారు చేస్తూ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. గత ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో జానారెడ్డి ఓడిపోయారు. అంతకుముందు ఇది జానారెడ్డి కంచుకోటగా ఉండేది. అయితే టీఆర్ఎస్ ప్రభంజనం ముందు జానారెడ్డి హవా పనిచేయలేదు. దీంతో ఓటమిపాలయ్యారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభ తగ్గిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జానారెడ్డిదే విజయమని అంచనా వేస్తోంది.
ఇక బీజేపీ కూడా ఈ సీటుపై కన్నేసింది. దుబ్బాక ఉపఎన్నికలో అనూహ్య విజయం సాధించడం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంచనాలను మించి సీట్లు సాధించడంతో బీజేపీలో జోష్ కనిపిస్తోంది. గట్టి అభ్యర్థిని నిలబెడితే తప్పకుండా విజయం సాధిస్తామని నమ్ముతోంది. అయితే ఇక్కడ ఇంకా ఎవరికీ సీటు ఖరారు చేయలేదు. అయితే పలువురు అభ్యర్థులు సీటు కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా అంజయ్య యాదవ్, నివేదితా రెడ్డి సీటు ఆశిస్తున్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికారంలో ఉండడం టీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్. ఇక జానారెడ్డి తన కంచుకోటలో మళ్లీ పాగా వేస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. జానారెడ్డికి స్థానికంగా మంచి పట్టు ఉండడం కలిసొచ్చే అంశం. ఇక బీజేపీకి స్థానికంగా పెద్దగా కేడర్ లేదు. అయితే తమ బలగాలన్నింటినీ మోహరించి ఫలితాలను తారుమారు చేయగలమని నిరూపించిన దుబ్బాక స్ఫూర్తితో ఇక్కడా పనిచేయాలనుకుంటోంది. మరి ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో చూద్దాం..













