రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలకు ఐటీని విస్తరిస్తాం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలకు ఐటీని విస్తరిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సృష్టం చేశారు. నిజామాబాద్‌లో మంత్రి ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతి నీటిబొట్టును రాష్ట్రంలోని బీడుభూములకు తరలిస్తామన్నారు. మహాకవి దాశరధి నిజామాబాద్ జైలు గోడలపై నా తెలంగాణ కోటీ రతనాల వీణ అని రాశారని అన్నారు. తెలంగాణను కోటీ ఎకరాల మాగాణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మారుస్తున్నారని పేర్కొన్నారు.
ఐటీ ఎగుమతుల్లో లక్ష కోట్లకు చేరుకున్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మూడేళ్లలో కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు మంజూరు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇతరత్రా గ్రాంట్లు కలుపుకుంటే మొత్తం రూ.900 కోట్లు వచ్చాయని గుర్తు చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరే ప్రభుత్వ లక్ష్యమని సృష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, షకీల్, మేయర్ ఆకుల సుజాతతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.













