Trolls: వాగడం.. సారీ చెప్పడం.. ఫ్యాషన్ అయిపోయింది..!!

ఇటీవలికాలంలో నేతల మాటలు మరీ శ్రుతిమించుతున్నాయి. నోటికొచ్చినట్టు వాగేస్తున్నారు. ఆ మాట మాట్లాడకూడదో.. లేదో కూడా ఆలోచించుకోవట్లేదు. ఎదుటివారు ఒకటంటే మనం రెండు అనాలన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. తీరా రచ్చ అయ్యాక నాలుక కరుచుకుంటున్నారు. సారీ తప్పయిపోయిందని.. క్షమించండి.. నా మాటలను ఉపసంహరించుకుంటున్నా.. అంటూ చిలకపలుకులు పలుకుతున్నారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన కామెంట్స్ తీరు ఇలాగే ఉంది. అనాల్సినవన్నీ అనేసి ఆవిడి తీరిగ్గా మాట మార్చేశారు.
కొండా సురేఖను మూడు రోజులుగా బీఆర్ఎస్ (BRS) నేతలు ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao), మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఓ కార్యక్రమానికి వక్రబాష్యాలు చెప్తూ వైరల్ చేస్తన్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కొండా సురేఖ.. కేటీఆర్ (KTR) ను టార్గెట్ చేస్తూ గట్టిగానే మాట్లాడింది. తన పార్టీ శ్రేణులు చేస్తున్న తప్పుకు ఆయన సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. అయికే కొండా సురేఖ కామెంట్స్ ను కేటీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. సారీ చెప్పలేదు. దీంతో కొండా సురేఖ సహనం కోల్పోయారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.
సినిమా ఇండస్ట్రీలో (Cinema Industry) పలువురు హీరోయిన్ల (Heroines) కెరీర్ ను కేటీఆర్ నాశనం చేశారని, వాళ్లకు డ్రగ్స్ (Drugs) అలవాటు చేశారని.. వాళ్ల ఫోన్లు ట్యాప్ (Phone tapping) చేశారని.. వాళ్ల వల్ల కొందరు విడాకులు (Divorce) తీసుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు. ఈ మాటలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె మాటలను సినిమా ఇండస్ట్రీ (Tollywood) మొత్తం ఖండించింది. తారల వ్యక్తిగత జీవితాల్లోకి రావడం సరికాదని.. రాజకీయాల్లోకి (politics) సినిమా తారలను లాగొద్దని పలువురు కొండా సురేఖకు సూచించారు. మరోవైపు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) కూడా ఆవిడను పిలిపించుకుని మాట్లాడారు. ఇలాంటివి పునరావృతం కావొద్దని సూచించారు.
తన వ్యాఖ్యలు ఇంతటి దుమారం రేపుతాయని గ్రహించని కొండా సురేఖ.. జరగాల్సిన నష్టం జరిగిపోయాక మేల్కొన్నారు. తాను అలాంటి ఉద్దేశంతో ఆ మాటలు అనలేదన్నారు. కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన మాటలు తప్ప మరొకరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. తన మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారు. అయితే కేటీఆర్ పై పోరాటం మాత్రం ఆపే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. ఇలా నేతలు మాటలు తిరగేయడం కొత్త కాదు. ఎంతోమంది నేతలు గతంలో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేసి చివర్లో సారీ చెప్పారు. కానీ ఒక్కసారి మాట నోరు జారాక ఆపతరమా..?