బీజేపీకి షాక్ ఇవ్వబోతున్న నలుగురు సీనియర్ నేతలు..!?
తెలంగాణ బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాగున్నట్టు కనిపించడం లేదు. బీఆర్ఎస్ ను గద్దె దించుతామనే బీజేపీ మాటలు నమ్మి చాలా మంది నేతలు కమలం కండువా కప్పుకున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పై బీజేపీ సాఫ్ట్ కార్నర్ చూపిస్తుండడంతో అలా చేరిన నేతలంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పైగా తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే ఆవేదన మొదటి నుంచి ఉంది. అందుకే అలాంటి నేతలంతా త్వరలోనే బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వీళ్లంతా కాంగ్రెస్ లో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కర్నాటక ఎన్నికల ఫలితాల వరకూ తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య వార్ ఓ రేంజ్ లో ఉండేది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు రేపింది. వెంటనే బీజేపీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామును వెలుగులోకి తీసుకొచ్చింది. కవిత చుట్టూ ఉచ్చు బిగించింది. కవిత అరెస్టు కావడం ఖాయమని.. ఇదే జోష్ తో ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా తమదే అధికారం అని కమలం పార్టీ నేతలు భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డిని కూర్చోబెట్టారు. అలాగే.. కవిత అరెస్టు కూడా ఆగిపోయింది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధంపై అనేక అనుమానాలు తలెత్తాయి.
జనానికి ఆ రెండు పార్టీల మధ్య బంధం ఉందనిపిస్తే అది వేరే లెక్క. కానీ సొంత పార్టీ నేతల్లోనే అలాంటి అభిప్రాయం కలిగితే చాలా కష్టం. ఇప్పుడు అదే జరుగుతోంది బీజేపీలో. చాలా మంది నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను వ్యతిరేకించి బీజేపీలో చేరారు. కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రంలో బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ దూకుడుగా వెళ్తుండడం ఆ పార్టీ పట్లన నమ్మకాన్ని కలిగించింది. దీంతో చాలా మంది నేతలు పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఎన్నికల రేసులో దూసుకుపోతుంటే బీజేపీ మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. దీంతో ఆ పార్టీపై నమ్మకాన్ని కోల్పోయారు పలువురు నేతలు.
బీజేపీలోనే ఉంటే తమ రాజకీయ ఉనికికే నష్టం కలుగుతుందని చాలా మంది నేతలు భావిస్తున్నారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఏనుగు రవీందర్.. తదితరులు తమకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదనే ఆవేదనతో ఉన్నారు. అయినా కేసీఆర్ ను ఓడిస్తామనే ధ్యేయంతో ఇన్నాళ్లు పార్టీలో ఉన్నామని.. కానీ ఇప్పుడు పార్టీలో అలాంటి పరిస్థితి లేదని వాళ్లు అంచనా వేస్తున్నారు. అందుకే త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఓడించాలంటే అది కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యమవుతుందని వాళ్లు నమ్ముతున్నారు. అందుకే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీళ్ల బాటలోనే మరికొందరు నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.













