కొండా వర్సెస్ చల్లా…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలిటికల్ ఫైట్ వేడెక్కింది. మరీ ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో కొండా, చల్లా వర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపు దాల్చింది. అది ఎంతవరకూ వెళ్లిందంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి.. నేరుగా కొండ మురళి వార్నింగ్ ఇచ్చారు.ధర్మారెడ్డి.. డేటు.. టైము చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా! అని కొండా సవాల్ చేశారు. ఎవరిని ఎవరు తరిమి కొడతారో తేల్చుకుందామని అన్నారు. పార్టీ అవకాశం ఇస్తే పరకాలలో పోటీ చేస్తానని, ధర్మారెడ్డి అంతు తేలుస్తానన్నారు.
పరకాలలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి, కాంగ్రెస్ లోని కొండా ఫ్యామిలీకి వార్ నడుస్తుంది. గత ఎన్నికల్లో కొండా సురేఖపై చల్లా ధర్మారెడ్డి విజయం సాధించారు. అయితే ఈ సారి చల్లాని ఓడించాలని కొండా ఫ్యామిలీ చూస్తోంది. ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈపరిణామాల్లో ఈ సారి పరకాలలో కొండా మురళి గాని, ఆయన కుమార్తె సుస్మితా పటేల్ గాని పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొండా మురళి పరకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఫలితంగా కొండా, చల్లా మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది.
వరంగల్ టూర్ లో కేటీఆర్.. కొండా టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు చేశారు. గూండాల రాజ్యం కావాలా అని ప్రజల్ని ప్రశ్నించారు. తమను గూండా అని సంబోధించడంపై కొండా ఫైరయ్యారు. అసలు ఉద్యమంలో లేనివాళ్లు పదవులు అనుభవిస్తున్నారని కేటీఆర్ పై ఫైరయ్యారు. తన పేరు నేరుగా ప్రస్తావించే ధైర్యం చేయలేరన్నారు. అయితే ఇంతలో చల్లా .. సీన్ లోకి ఎంటరయ్యారు. కొండా తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
దీంతో ధర్మారెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు కొండా..ధర్మారెడ్డి మట్టి దొంగ అని… అరాచకాలు భరించలేక ఆయన కార్యకర్తలు తన దగ్గరకు వస్తున్నారని, మైసమ్మ సాక్షిగా పరకాలలో ధర్మారెడ్డిని ఓడిస్తానని సవాల్ చేశారు. ఇలా కొండా సవాల్ చేయడంతో పరకాల రాజకీయం వేడెక్కింది. మరి ఈ సారి పరకాల పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.













