అభ్యర్థులపై కేసీఆర్ నిఘా..? కొందరిని మార్చే ఛాన్స్..!?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రణరంగంలోకి అందరికంటే ముందుగా దూకారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దాదాపు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి తరిమారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు, ప్రచారం చేసుకునేందుకు తగిన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ముందుగా అభ్యర్థులను అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికీ పలువురు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లట్లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఒకవేళ వెళ్లినా ప్రచారంలో వెనకబడుతున్నారని నివేదికలు అందుతున్నాయి. అందుకే అభ్యర్థులపై నిఘా పెట్టారు కేసీఆర్. ఎవరైనా అభ్యర్థిపై తగిన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోతే అలాంటి వారిని మార్చేయాలని డిసైడయ్యారు.
ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పార్టీలన్నీ అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. తెలంగాణ సాధించిన పార్టీగా దానికి పేరుంది. కాబట్టి ఇన్నేళ్లూ ఆ పార్టీని ఆదరించారు తెలంగాణ ప్రజలు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని.. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని విపక్షాలు చెప్తున్నాయి. కేసీఆర్ ను ఈసారి ఎలాగైనా ఇంటికి పంపిస్తామని సవాల్ చేస్తున్నాయి. అయితే విపక్షాల ఆరోపణలను, విమర్శలను ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్ అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించారు.
మొత్తం 119 స్థానాల్లో 115 స్థానాలు అభ్యర్థులను ఒకేసారి అనౌన్స్ చేసి కేసీఆర్ చరిత్ర సృష్టించారు. ఇక మిగిలినవి నాలుగు స్థానాలే. వాటికి కూడా నేడోరేపో అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. అయితే అభ్యర్థులను అనౌన్స్ చేసి పదిరోజులు అవుతున్నా ఇంతవరకూ తగిన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావట్లేదని కేసీఆర్ గ్రహించారు. అభ్యర్థిని ముందుగా అనౌన్స్ చేస్తే ప్రజల్లోకి వెళ్లేందుకు తగిన సమయం దొరుకుతుందని కేసీఆర్ భావించారు. అయితే పేరు అనౌన్స్ చేసిన తర్వాత కూడా చాలా మంది నేతలు హైదరాబాద్ వదిలి వెళ్లలేదని కేసీఆర్ దృష్టికి వచ్చింది. జనంలోకి వెళ్లకుండా హైదరాబాద్ లో కూర్చుంటే ప్రజలు ఆదరించరని.. ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.
అందుకే ఇకపై రోజువారీగా నివేదికలు తెప్పించుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రతిరోజూ అభ్యర్థి ఎక్కడ ఉన్నారు.. ఏం చేశారు.. నియోజకవర్గంలో ఉన్నారా.. ప్రజల వద్దకు వెళ్లారా.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారా.. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది.. లాంటి అనేక అంశాలను ఆరా తీయనున్నారు. ఎక్కడైనా ప్రజలను ఆకర్షించడంలో అభ్యర్థి వెనుకబడినా.. జనంలోకి వెళ్లకుండా ఇంటికే పరిమితం అయినా.. అలాంటి వారిని పక్కన పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. టికెట్ దక్కింది కదా ఇక చాల్లే.. నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాం.. అని చాలా మంది నేతలు ఇప్పటికీ తాత్సారం ప్రదర్శిస్తున్నారని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే అలాంటి వారిందరినీ అవసరమైతే మార్చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.













