షాకింగ్.. టీఆర్ఎస్ కు జనసేన మద్దతు..!
జనసేన ఇప్పుడు బీజేపీతో కలిసి పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అండర్ స్టాండింగ్ తో పనిచేశాయి. తాజా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పొత్తు పొడిచింది. ఇక ముందు కూడా ఈ జర్నీ కంటిన్యూ అవుతుందని ఇరు పార్టీల నేతలూ చెప్తున్నారు. తెలంగాణలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన మొదట పోటీ చేయాలని భావించినా.. బీజేపీ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు జనసైనికులు వెనక్కు తగ్గారు. చివరకు బీజేపీకే మద్దతిచ్చారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ కు జనసేన మద్దతిస్తోంది. ఇదే పెద్ద ట్విస్టు.
ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంతో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. ఇందులో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో టీఆర్ఎస్ నుంచి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి, బీజేపీ నుంచి సిట్టింగి ఎమ్మెల్సీ రామచంద్రరావు, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని టీఆర్ఎస్ ఈసారీ ఎలాగైనా ఈ స్థానాన్ని గెలిచి తీరాలనే పట్టుదలతో పనిచేస్తోంది.
బీజేపీ హిందూ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. బ్రాహ్మణ ఓటు బ్యాంకు బీజేపీకి ప్లస్ పాయింట్. దీంతో బీజేపీ ఓటుబ్యాంకును దెబ్బ కొట్టాలంటే బ్రాహ్మణ వర్గానికి చెందిన అభ్యర్థినే బరిలోకి దింపాలనే వ్యూహంతో సురభి వాణీదేవిని బరిలో నిలిపింది టీఆర్ఎస్. పైగా పీవీ నరసింహారావు కుమార్తె కావడంతో కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు బీజేపీ బ్రాహ్మణ ఓటుబ్యాంకును కొల్లగొట్టడం, పీవీ చరిష్మాతో కాంగ్రెస్ ఓట్లను రాబట్టుకోవడం టీఆర్ఎస్ వ్యూహం. ఇందులో ఆ పార్టీ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.
మరోవైపు అనూహ్యంగా జనసేన శ్రేణులు టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నాయి. వాణిదేవిని గెలిపించాలంటూ జనసేనకు చెందిన శతఘ్ని విభాగం ప్రచారం చేస్తోంది. బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేన.. ఇక్కడ టీఆర్ఎస్ కు మద్దతివ్వడమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తున్నట్టు జనసేన అధికారికంగా ప్రకటించలేదు. అటు టీఆర్ఎస్ అభ్యర్థికి కూడా మద్దతిస్తున్నట్టు అధికారికంగా చెప్పలేదు. కానీ ఆ పార్టీ శ్రేణులు మాత్రం సురభి వాణిదేవికి మద్దతివ్వాలని కోరుతున్నాయి. అంతేకాదు.. సురభి వాణిదేవి కూడా కొన్ని చోట్ల పోస్టర్లలో జనసేన జెండాను, పవన్ కల్యాణ్ ఫోటోలను వాడుకుంటున్నారు. మరి ఈ కలయిక ఎక్కడ మొదలైందోననే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.













