200 రోజులుగా ఉద్యమం చేస్తుంటే.. ప్రభుత్వంలో చలనం రాదా?
ఉత్తర భారతంలో 200 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే బీజేపీ ప్రభుత్వంలో చలనం రాదా? అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కులమతాల పేరుతో బీజేపీ రెచ్చగొట్టే రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ ప్రధాని అయ్యాక భావోద్వేగ రాజకీయాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంక గాంధీని అరెస్టు చేశారని ఇదేం ప్రజాస్వామ్యమని నిలదీశారు. ప్రియాంక గాంధీని వెంటనే విడుదల చేయకపోతే తామంతా రోడ్ల మీదికి రావాల్సి ఉంటుందన్నారు. సంగారెడ్డి నుంచి ఉద్యమం మొదలు పెడతానని హెచ్చరించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులను బయటకు రాన్వివడం లేదని, పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. యూపీ ఘటనలో కేంద్రమంత్రి కొడుకును ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. పార్లమెంట్లో రైతుల కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. బీజేపీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ ఒక్కటేనని విమర్శించారు.













