మళ్లీ లేక్ సిటీగా హైదరాబాద్.. పట్టుదలతో రేవంత్ సర్కార్..

భాగ్యనగరం… నిజాంపాలన కాలంలో చెరువులతో విలసిల్లేది. తమ పాలనలో నిజాం ప్రభువులు.. హైదరాబాద్ పరిరక్షణకు చెప్పుకోదగిన జాగ్రత్తలుతీసుకున్నారు. మూసి వరదల విలయాన్ని చూసి చలించిన నిజాంపాలకులు… నాటి ద గ్రేట్ ఆర్కిటెక్ట్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను రప్పించి.. మరోసారి నగరం వరదమయం కాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. దానిలో భాగంగా మూసీ,ఈసీ నదులపై హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు ఏర్పాటయ్యాయి. గోదావరి, కృష్ణానదుల్లో నీటి లభ్యత తగ్గిన సమయంలో హైదరాబాద్ దాహార్తిని ఈజలాశయాలే తీర్చాయి.
అయితే ఆ తర్వాత క్రమంగా నగరం విస్తరించింది. నాటి బడాబాబులు, వ్యాపార వేత్తలు, వీఐపీలు.. క్రమంగా నగరంలో స్థిరపడ్డారు. వారు చెరువులు, నాళాలు,జలాశయాలను ఆక్రమించి, విలాసవంతమైన ఫామ్ హౌసులు కట్టేసుకున్నారు. వాటిని ప్రభుత్వాలు గుర్తించేసరికి… ఆలస్యమైపోయింది. తర్వాత .. వారిని ప్రబావితం చేస్తూ ఫామ్ హౌసులు, అక్రమ కట్టడాలను రక్షించుకుంటూ వచ్చారు. అందరికి తెలుసు… సిటీలో చెరువులును ఆక్రమించి అక్రమకట్టడాలు కట్టారని.. కానీ ఏ ప్రభుత్వం కూడా వారిపై ఎలాంటి చర్య తీసుకోలేకపోయింది. అయితే వాటికి మినహాయింపుగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం.. అక్రమ కట్టడాలను సమూలంగా కూల్చేస్తోంది.
చెరువుల్లో విలాసవంతమైన ఫాంహౌస్‌లు నిర్మించుకున్నవారిలో సమాజాన్ని, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగే స్థానాల్లో చాలామంది ఉన్నారని.. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండవచ్చని.. అయినా పట్టించుకోకుండా ఆక్రమణదారుల భరతం పడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఇది రాజకీయాల కోసమో.. రాజకీయ నాయకులను దృష్టిలో ఉంచుకునో చేపడుతున్న కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. సరస్సులు, నదులు, చెరువులు భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించే సంపద అని.. వాటిని విధ్వంసం చేస్తే మనపై ప్రకృతి కక్ష కడుతుందని చెప్పారు. ప్రకృతి ప్రకోపిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్‌లలో చూశామని గుర్తుచేశారు.
నగరానికి చెరువులే ఆకర్షణ..
‘‘హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సుందరమైన నగరానికి చెరువులే ఆకర్షణ. వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరేమనుకున్నా.. ఎవరు ఏ ఒత్తిడి చేసినా వాటిని పక్కనపెట్టి ప్రభుత్వం ఆక్రమణదారుల భరతం పడుతుంది.
భగవద్గీతే స్పూర్తి..
మన దినచర్యలో కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. ఆ ఖాతాను, బ్యాలెన్స్ షీట్‌ను సవరించుకోవడానికి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా. అందులో భాగంగా చెరువులను చెరబట్టినవారిని వదలకుండా ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం. దీనికి స్ఫూర్తి భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేస్తే.. అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందేనని పార్థునికి యుద్ధనీతి బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇవ్వాళ ఆ కృష్ణుని బోధనలను అనుసరించే చెరువులను కాపాడే కార్యక్రమాన్ని తీసుకుంటున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.