శెభాష్ రేవంత్..! ఈ టెంపో కంటిన్యూ చేయగలరా..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి చూపూ 5 గ్యారంటీలపైనే ఉండేది. వాటిని అమలు చేస్తే రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్లేనని చెప్పుకొచ్చారు. అందులో మెజారిటీ స్కీంలను పట్టాలెక్కించారు. వాటిలో ఉన్న చిన్నచిన్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. ఈ పని మున్ముందు కూడా కంటిన్యూ చేయగలరా అనేదే పెద్ద ప్రశ్న.
రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ లో దశాబ్దాలుగా ఆక్రమించిన ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. అక్రమ కట్టడాలను కూల్చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం హైడ్రా పేరుతో ప్రత్యేక వ్యవస్థనే రూపొందించారు. దీనికి విస్తృతాధికారాలు కల్పించారు. ఐపీఎస్ అధికారి రంగనాథ్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఆక్రమిత భూముల వివరాలను తెప్పించుకుని వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు హైడ్రా పనిచేస్తోంది.
దాదాపు రెండు వారాలుగా హైడ్రా పలు ఆక్రమణలను కూల్చివేస్తోంది. బుల్డోజర్లతో పలువురి భవనాలను నేలమట్టం చేసింది. అయితే మాదాపూర్ నడిబొడ్డున సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఎన్-కన్వెన్షన్ పై దశాబ్దాలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. చెరువును ఆక్రమించి ఆ హాల్ కట్టారనే ఫిర్యాదులు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే దాని జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. కేవలం నోటీసులతో సరిపెట్టారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 4-5 గంటల వ్యవధిలో ఎన్-కన్వెన్షన్ ను పూర్తిగా కూల్చేశారు.
నాగార్జున మాత్రమే కాదు.. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు చెందిన అనేక ఆస్తులు కబ్జా భూముల్లో ఉన్నాయి. హిమాయత్ సాగర్, గండిపేట లాంటి చెరువుల సమీపంలో ఎంతోమందికి ఫాంహౌసులు ఉన్నాయి. వాటిని కూడా రేవంత్ రెడ్డి కూల్చుతారా.. అనేది ఇప్పుడ వినిపిస్తున్న పెద్ద ప్రశ్న. రేవంత్ రెడ్డి మాత్రం అక్రమ కట్టడాలు ఎవరివైనా ఉపేక్షించే ప్రశ్నే లేదని తేల్చి చెప్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భవనాలను కూడా హైడ్రా కూల్చేసింది. ఇదే పని మున్ముందు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. మరి చూడాలి.. రేవంత్ ఈ స్పీడ్ ఎంతకాలం కంటిన్యూ చేస్తారో..!!