హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా సదస్సు
బయో ఏషియా-2024 సదస్సు 21 ఎడిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌సీసీ)లో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సు సన్నాహాలను తెలంగాణ సమాచార సాంకేతిక, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమీక్షించారు. బయో ఏషియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరుగుతుండటంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా భారతీయ, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికికి బయో ఏషియా కీలక సాధనంగా ఉద్భవించిందన్నారు. అంతర్జాతీయ వేదికపై ఈవెంట్ ప్రాముఖ్యత పెంచడంతో అనేక మంది గ్లోబల్ సీఈవోలు మొదటిసారిగా బయో ఏషియాకు హాజరవుతున్నారని ప్రకటించేందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, బయోఏషియా సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.













