గద్దర్ రాజకీయ పయనమెటు?
ప్రజాయుద్ధనౌక గద్దర్ కొత్త పార్టీని స్థాపించారు. గద్దర్ ప్రజాపార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. నెలరోజుల్లో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానుంది. ఈ సందర్బంగా సీఎం కేసిఆర్ తీరుపై గద్దర్ ఫైరయ్యారు. బంగారు తెలంగాణ కాలేదు, పుచ్చి పోయిన తెలంగాణ చేశారని…. కేసిఆర్ విధానాలు తప్పు అని మండిపడ్డారు. ధరణి పేరుతో ేసిఆర్ భూములు మింగాడని… పదేళ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదన్నారు. కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించారు.
అత్యంత బలమైన పార్టీ బీఆర్ఎస్.. దాన్ని ఢీకొట్టి, పడగొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు పడరాని పాట్లు పడుతున్నాయి. ఎన్ని ప్లాన్స్ వేసినా.. వాటిని కేసీఆర్ ముందుగానే చిత్తు చేస్తున్నారు. అంత క్యాడర్, జాతీయ పార్టీలే ఏం చేయలేక, సతమతమవుతుంటే.. తానొచ్చి లైన్ సెట్ చేస్తానంటున్నారు గద్దర్. ఒకప్పుడు గద్దర్ అంటే ఫైర్ బ్రాండ్.. ఆయన మాట, పాట.. తెలంగాణను ఉర్రూతలూగించేది. కానీ ఇప్పుడు .. పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
పరిస్థితులను బట్టి గద్దర్ సైతం పార్టీలు మారుస్తూ.. ఫక్తు రాజకీయనాయకుడిగా మారిపోయారని విమర్శలు వస్తున్నాయి. ఓ సమయంలో కాంగ్రెస్ పార్టీనేతలకు సన్నిహితంగా మెలిగారు. తర్వాత కోదండరాంతోనూ కనిపించారు. మొన్నటికి మొన్న మునుగోడు ఎన్నికల్లో కేఏపాల్ పార్టీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ.. పోటీ నుంచి గద్దర్ తప్పుకున్నారు. ఇలా ఎప్పటికప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తుండడంతో.. గద్దర్ రాజకీయంగా ప్రజల మనసుల్ని గెలుచుకోలేకపోయారని చెప్పక తప్పదు.
ఇప్పుడు కేసీఆర్… తెలంగాణలో శక్తిమంతమైన నేత. దేశంలోని విపక్షాలకు సైతం ద్రవ్యసాయం చేయగలిగే స్థితిలో ఉన్నారు. అలాంటి దిగ్గజాన్ని.. గద్దర్ ఎలా ఎదుర్కొంటారు. ఆయనకు ఏ పార్టీలు మద్దతిస్తాయి..? కేసీఆర్ పోటీ చేసే చోటు విపక్షాలన్నీ కలిసి సింగిల్ అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి ఉందా..? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.













