బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ఆహ్వానం..?
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైంది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సీఎంతో బేటీ అయ్యారు. దీంతో వీరంతా పార్టీ మారతారంటూ ప్రచారం సాగింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టి ఈ ఊహాగానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సీఎంను మర్యాద పూర్వకంగానే కలిసామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఎన్ని సార్లైనా ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. తమ కార్యకర్తలు కన్ఫ్యూజన్లో ఉన్నారని అందుకే ఈ వివరణ ఇస్తున్నామన్నారు ఆ నలుగురు ఎమ్మెల్యేలు. ఇటీవలే రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలవడం హాట్ డిస్కషన్‌కు దారి తీసింది. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడం రాజకీయ గుసగుసలకు ఆస్కారం ఇచ్చింది.
BRS ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో తప్పేముందన్నారు కాంగ్రెస్ మంత్రులు, నేతలు.. తెలంగాణ పౌరులు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా కానీ సీఎంని కలవొచ్చని అన్నారు. గతంలో సీఎంను కలవడానికి అవకాశమే ఉండేది కాదని కానీ తమ సీఎం మాత్రం ఎవరినైనా కలుస్తారని అంటున్నారు. సీఎం అంటే… ఏఒక్క పార్టీకో పరిమితం కాదని, రాష్ట్రంలో ఉన్నవారందరికీ సిఎం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. అయితే బీజేపీ మాత్రం.. ఇది ఓ పెద్దడ్రామా అంటోంది. హరీశ్‌రావు.. తన కోవర్టులను కాంగ్రెస్‌లోకి పంపిస్తున్నారని.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన పనినే… ఇప్పుడు కాంగ్రెస్ తూచా తప్పకుండా అనుసరిస్తోందన్నారు. నెమ్మదిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను.. కాంగ్రెస్ గుంజుకుంటుందన్నారు.
అయితే ఈ వ్యవహారం బీఆర్ఎస్లో పెనుచర్చకు దారి తీసింది. ఇంత యాక్టివ్‌గా పార్టీ నేతలున్నప్పటికీ… నలుగురు ఎమ్మెల్యేలు ఎలా సీఎంను ఎప్రోచ్ అయ్యారు. వీరు నిజంగా నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికే సీఎంను కలిశారా..? పార్టీ మారే ఉద్దేశ్యముందా.. అన్న అనుమానాలు ఆపార్టీనేతలను వేధిస్తున్నాయి. ఓవేళ వీరు పార్టీ మారాలనుకుంటే.. వీరికి లైన్ క్లియర్ చేసిందెవరన్న అంశంపైనా హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వీరేనా ఇంకా ఎవరైనా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు లోనవుతున్నారా.. ? అన్న కోణంలోనూ పార్టీ హైకమాండ్ ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవలే మంత్రి కోమటి రెడ్డి సైతం.. తమతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పడం కూడా సంచలనం సృష్టించింది.
అయితే లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను ఢిఫెన్స్లో పడేయడం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ చేసినట్లుగానే కొందరు ఎమ్మెల్యేలను.. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం ద్వారా.. గులాబీ హైకమాండ్‌ను అయోమయంలోకి నెట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సహజంగానే బీఆర్ఎస్లో ఉన్న పలువురు నేతలు.. గతంలో వివిధ పార్టీల్లో ఉన్నవారే. వారిని బీఆర్ఎస్ ఎలా తమ పార్టీలో చేర్చుకుందో.. ఇప్పుడు అదే విధానం కాంగ్రెస్ సైతం అవలభిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈపరిణామం బీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందికరమనే చెప్పాలి.













