తుమ్మల విషయంలో సుజనాను రంగంలోకి దించారా…?
తెలంగాణలో కొంత మంది టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కాస్త ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అనుభవం ఉన్న కొంత మందిని వాడుకొనే విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పుడు విఫలమవుతున్నారనే భావన కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని భారతీయ జనతా పార్టీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు విషయంలో అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కడియం శ్రీహరి విషయంలో సీఎం కేసీఆర్ కాస్త వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి.
తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కడియం శ్రీహరి ముగ్గురు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పని చేయలేదు అని ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపించాయి. దీనికి ప్రధాన కారణం వాళ్ల విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి అని చాలా మంది వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి షర్మిల పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది.
దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఏ పార్టీ లోకి వెళ్ళకుండా అలాగే సైలెంట్ గా ఉన్నారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆయన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రం బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే రాజ్యసభ సీటు ఇస్తామని కేంద్ర ప్రభుత్వ పెద్దల హామీతో నాగేశ్వరరావుకి ఆయన హామీ ఇచ్చారని రాజకీయవర్గాలు అంటున్నాయి.
తెలుగుదేశం పార్టీ లో ఇద్దరు కలిసి పనిచేసిన సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో భారతీయ జనతా పార్టీ తుమ్మల నాగేశ్వరరావు విషయంలో సుజనాచౌదరిని రంగంలోకి దించినట్టు గా సమాచారం. ఈ విషయంలో తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని అయితే సుజనాచౌదరి ఇచ్చిన ఆఫర్ నచ్చడంతో తుమ్మల నాగేశ్వరరావు ఆలోచిస్తున్నారని అంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఆయన విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. కడియం శ్రీహరి విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.













