ఎప్పుడు ఎన్నికలు వచ్చినా… కేసీఆర్ ప్రభుత్వం
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై ఉన్న కోపాన్ని సీఎం కేసీఆర్ రైతాంగం మీద చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ కొత్తగా వచ్చింది కాదని, దశాబ్దాలుగా కొనసాగుతుందని తెలిపారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీలా పనిచేస్తుందని ఆరోపించారు. ధాన్యం పండిరచి పార్టీ కార్యాలయాలు, ఇళ్ల ముందు పోస్తామని సీఎం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరి వేయొద్దంటే రైతుల పరిస్థితేంటని ప్రశ్నించారు.
తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపంటను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం తెలంగాణ బీజేపీ కృషి చేస్తుందన్నారు. 30 లక్షల ఎకరాల్లో ధాన్యాన్నే కొనలేని సీఎం, కోటీ ఎకరాల్లో ధాన్యం పండిస్తే పరిస్థితేంటి? అని ప్రశ్నించారు.













