సలహాదారులు కాదు.. చరిత్ర గతిని మార్చేది వారే : ఈటల
ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ పదజాలాన్ని ప్రజలు చీ కొడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోకాళ్ళ మీద నడిచినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తన పని అయిపోయిన కారణంగానే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ సహకారం తీసుకుంటున్నారని అన్నారు. సలహాదారులు కాదు చరిత్ర గతిని మార్చేది ప్రజలేనని కేసీఆర్ మర్చిపోయారని అన్నారు. తన కుతంత్రాలు, కుట్రలు, పరిజ్ఞానం సరిపోనందుకే కేసీఆర్ పీకే సాయం తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రానికి అరిష్టమని తెలంగాణ ప్రజలు స్థిర నిర్ణయానికొచ్చారని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ బానిసలన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే కేసీఆర్కు భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ గంటలతరబడి ప్రెస్ మీట్లకు కారణం హుజురాబాద్ ఓటమే అన్నారు. నాయి బ్రహ్మణులను రజకులను సీఎం కేసీఆర్ నిలువునా మోసం చేశారని ఆరోపించారు.













