తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ఫోకస్.. కేంద్ర బృందం కీలక సూచనలు!
ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర ఐసీ బృందాన్ని తెలంగాణకు పంపించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో ఈ బృందం భేటీ అయింది. కేంద్రం నుంచి వచ్చిన ఈసీ బృందానికి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ నేతృత్వం వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్‌తోపాటు ఇతర ఎన్నికల అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ, సిబ్బంది శిక్షణ గురించి ఈ భేటీలో చర్చించారు. ఈ విషయంలో కేంద్ర బృందం పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చింది. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు అందరికీ రెండు రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించాలని కూడా సూచించింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని సలహా చెప్పింది. రిటర్నింగ్ అధికారుల జాబితాను సిద్ధం చేయాలని తెలిపింది. జూన్ 1 నుంచి ఆర్వోలు, ఈవీఎంల తనిఖీలు కూడా మొదలు పెట్టాలని ఆదేశించింది. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేసింది.













