Etala Rajendar : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల..!?

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ (BJP) దాదాపు పదేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోంది. కర్నాటక తర్వాత ఆ పార్టీకి మంచి పట్టున్న దక్షిణాది రాష్ట్రం తెలంగాణ (Telangana) మాత్రమే. అందుకే ఇక్కడ కొంచెం కష్టపడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అయితే సరైన నేతలు లేకపోవడం, నేతల మధ్య సమన్వయ లోపం ఆ పార్టీకి పెద్ద శాపంగా మారాయి. అందుకే ఈసారి దమ్మున్న ఓ నేతను అధ్యక్షుడిగా కూర్చోబెట్టి పార్టీని ఆధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోంది. ఈ రేసులో ఈటల రాజేందర్ (Etala Rajendar) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
తెలంగాణలో అధికారం కోసం బీజేపీ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీ గెలుస్తుందని భావించారు. అందుకు తగ్గట్టుగానే బీజేపీ కూడా దూకుడు ప్రదర్శించేది. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారనే పేరుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బండి సంజయ్ (Bandi Sanjay) సక్సెస్ అయ్యారు. అయితే నేతల మధ్య అనైక్యత బండి సంజయ్ ను పదవి నుంచి తప్పించేలా చేసింది. చాలా మంది నేతలు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో మళ్లీ కిషన్ రెడ్డికి (Kishan Reddy) అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది హైకమాండ్.
కిషన్ రెడ్డి అధ్యక్షుడు కావడం కొత్తకాదు. అయితే ఆయన కేంద్రమంత్రిగా ఉండడంతో రాష్ట్రంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. అలాగని వేరేవాళ్లకు ఆ బాధ్యతలు అప్పగిస్తే నేతల మధ్య పొసగట్లేదు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకంటున్నారు. దీన్ని పరిష్కరించడం అధిష్టానానికి పెద్ద సవాల్ గా మారింది. అయితే ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకూడదని.. వీలైనంత త్వరగా అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. దీని తర్వాత సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలనుకుంటోంది. ఆ వెంటనే కొత్త అధ్యక్షుడిని నియమించనుంది.
బీజేపీ అధ్యక్షుడిగా బీసీని నియమించాలని హైకమాండ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులోనే ఎంపీగా ఉన్న వ్యక్తికి ఈ బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఇటు రాష్ట్రం, అటు కేంద్రం మధ్య సమన్వయం సులువుగా ఉంటుందని భావిస్తోంది. అందుకే ఈటల రాజేందర్ కు ఈ బాధ్యతలు అప్పగించేందుకు హైకమాండ్ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) కూడా అధ్యక్ష బాధ్యతలు కావాలని ఆశిస్తున్నారు. అంతేకాదు.. డీకే అరుణ (DK Aruna), రఘునందన్ రావు (Raghunanandan Rao) కూడా ఆశలు పెట్టుకున్నా.. ఓసీకి పగ్గాలు ఇచ్చే అవకాశం లేదని సమాచారం. అందుకే ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు ఇవ్వబోవడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.