ఐటీ ఉద్యోగస్తుల బాధలపై గళం విప్పిన సీపీఐ నేత సాంబశివరావు..

మన సమాజంలో ఐటీ ఉద్యోగస్తులు అంటే కంప్లీట్ గా సెటిల్ అయిన వాళ్ల కింద చూస్తారు. మంచి జీతాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు అని అందరూ భావిస్తారు. వారి లైఫ్ స్టైల్, సంపాదన ఇలాంటి అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యత వాళ్ళు పడుతున్న కష్టానికి ఇవ్వడం మాత్రం మర్చిపోతారు. ఎదుగుదలకు ఎంతో అవకాశం ఉన్న ఐటీ ఇండస్ట్రీలో స్ట్రెస్ కూడా అంతకంత పెరుగుతూనే ఉంది. దూరపు కొండలు నునుపు అన్నట్టు.. చూడడానికి ఈ ఉద్యోగాలు ఎంతో బాగుంటాయి కానీ చేసే వారికి మరొక లాగా ఉంటాయి. అద్దాల గదుల్లో చల్లని ఏసీ కింద కూర్చొని పని చేయడం మాత్రమే అందరికీ కనిపిస్తుంది.. కానీ ప్రతికూలతల మధ్య ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వాళ్ళు అనుభవించే వత్తిడి వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ఐటీ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు గురించిన ప్రస్తావన రావడంతో అందరూ మరొకసారి ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు.
ఇప్పటివరకు ఎవరు ఆలోచించని విధంగా ఆలోచించడమే కాకుండా ఐటీ రంగంపై నియంత్రణ అవసరమంటూ సిపిఐ ఎమ్మెల్యే చేసిన కీలక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అంటే అదృష్టవంతులు అని అంచనా వేస్తారు కానీ…రోజుకు వాళ్లు 14 గంటల నుంచి 16 గంటల వరకు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది అని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు ఐటీ కంపెనీలలో పెరుగుతున్న పని ఒత్తిడి గురించి ప్రస్తావించడమే కాకుండా ప్రభుత్వం ఈ కంపెనీలు పెంచుతున్న పని వేళలు.. వాటిపై నియంత్రణ అవసరం అనే అంశాల గురించి ప్రస్తావించారు. అపరిమితంగా గంటల కొద్ది పని చేయడం వల్ల యువత తమ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పని భారంతో ఐటీ ఉద్యోగుల వెన్ను విరిగిపోతోందని సాంబశివరావు పేర్కొన్నారు. ఐటీ కంపెనీల పనితీరును క్రమ వర్గీకరించాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్న సాంబశివరావు ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఐటీ ఉద్యోగస్తులకు ఊరట కలిగించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎందరో ఐటి ఉద్యోగస్తులు సాంబశివరావు మాటలకు తమ మద్దతును తెలియజేస్తున్నారు.