కాంగ్రెస్ గర్జన…
తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మం సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ప్రజాగర్జన సభకు ముఖ్య అతిధిగా హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎన్నికల హామీలను ప్రకటించారు. ముఖ్యంగా సంక్షేమబాటలో పయనిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. వృద్ధులు, వితంతువులకు చేయూత పేరుతో 4 వేలు పించను ఇస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములన్నీ గిరిజనులకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. కర్నాటక తరహాలో తెలంగాణలోనూ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ విద్వేషాన్ని రగిలిస్తుంటే, దేశాన్ని ఏకం చేసేందుకు జోడో యాత్ర చేశామన్నారు రాహుల్. ఇదే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్థించిందన్నారు రాహుల్. అదే సమయంలో పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నామన్న రాహుల్.. పులిలా పోరాడుతున్నారని ప్రశంసించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా. అన్న రాహుల్….పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న భట్టి విక్రమార్కకు అభినందనలు తెలిపారు.
మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పై రాహుల్ విరుచుకుపడ్డారు.తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ .. ప్రజల కలలను ధ్వంసం చేసిందన్నారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీగా రాహుల్ ఆభివర్ణించారు. పార్లమెంట్లో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌గా పనిచేసిందన్నారు. రైతుల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తే.. బీఆర్ఎస్ మద్ధతు పలికిందని గుర్తు చేశారు. కేసీఆర్ రిమోట్ ప్రధాని మోదీ చేతిలో ఉందని సెటైర్లు వేశారు. కేసీఆర్ అవినీతికి ప్రధాని మోదీ అండదండలే కారణమన్నారు రాహుల్. కేసీఆర్ ఏ స్కామ్‌లు చేశారో కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మోడీకి తెలుసు.. అందుకోసమే బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ గా పనిచేస్తోందని రాహుల్ తీవ్రంగా ఆక్షేపించారు. .
కర్ణాటకలో రైతులు, ఆదివాసీలు, పేదలు అందరూ కాంగ్రెస్ పక్షాన నిలిచారని రాహుల్ గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ఇదే జరగబోతోందన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది. ప్రస్తుతం బీజేపీ బీటీమ్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉందన్నారు రాహుల్. కర్ణాటకలో బీజేపీని ఓడించినట్లే తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్‌కు ఎలాంటి ఒప్పందం ఉండదని తేల్చిచెప్పారు.. ఇటీవల ఢిల్లీలో విపక్షాల సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ వస్తే, తాము రామని చెప్పామన్నారు.













